Petrol and diesel prices hiked for the fourth time in 10 days due to rising global crude oil rates and a weakening Rupee. Check the latest fuel prices in Hyderabad, Vijayawada, Delhi, and Mumbai here.
.jpg&w=3840&q=75)
దేశంలో ఇంధన మంటలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, పశ్చిమ ఆసియాలో నెలకొన్న భూరాజకీయ ఉద్రిక్తతల ప్రభావం దేశీయ వినియోగదారులపై గట్టిగా పడుతోంది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) కేవలం పది రోజుల వ్యవధిలోనే వరుసగా నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ సామాన్యుడి నడుం విరిచాయి. తాజా సవరణతో లీటర్ పెట్రోల్‌పై రూ. 2.84 వరకు, డీజిల్‌పై రూ. 2.86 వరకు అదనపు భారం పడింది. పెరిగిన ధరలు ఈరోజు (మే 25) ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. సుదీర్ఘ విరామం తర్వాత మే 15 నుంచి ప్రారంభమైన ఈ ధరల పెంపు పరంపరతో.. కేవలం పది రోజుల్లోనే లీటర్ ఇంధనం ధర దాదాపు రూ. 7.50 మేర పెరగడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో ‘సెంచరీ’ దాటి దూసుకుపోతున్న ధరలు
తాజా పెంపుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విజయవాడ, గుంటూరు నగరాల్లో పెట్రోల్ ధర రూ. 117 దాటేయగా, డీజిల్ సైతం రూ. 105 మార్కును దాటింది. హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరల పట్టిక:
విజయవాడ: పెట్రోల్ రూ. 117.19 | డీజిల్ రూ. 104.88
గుంటూరు: పెట్రోల్ రూ. 117.59 | డీజిల్ రూ. 105.28
హైదరాబాద్: పెట్రోల్ రూ. 115.58 | డీజిల్ రూ. 113.74
దేశ రాజధానిలో రూ. 100 మార్కు దాటిన పెట్రోల్
దేశ రాజధాని ఢిల్లీలో సైతం పెట్రోల్ ధర లీటరుకు రూ. 2.61 పెరిగి, రూ. 102.12 కి చేరడం ద్వారా వంద రూపాయల మార్కును దాటింది. అక్కడ డీజిల్ ధర రూ. 95.20 కి చేరుకుంది. ఇతర మెట్రో నగరాలైన ముంబైలో పెట్రోల్ రూ. 111.21 (డీజిల్ రూ. 97.83), కోల్‌కతాలో పెట్రోల్ రూ. 113.51 (డీజిల్ రూ. 99.82), చెన్నైలో పెట్రోల్ రూ. 107.77 (డీజిల్ రూ. 99.55) గా నమోదయ్యాయి.
అంతర్జాతీయ ఉద్రిక్తతలే ప్రధాన కారణం
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన ‘హార్ముజ్ జలసంధి’ లో ఏర్పడిన అంతరాయాలు, పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరా అస్థిరంగా మారింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణించడంతో చమురు దిగుమతి ఖర్చులు భారత్‌కు పెనుభారంగా మారాయని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), భారత్ పెట్రోలియం (BPCL) అధికారులు వెల్లడించారు.
ధరలు పెంచినా తప్పని భారీ నష్టాలు
ఇంతలా ధరలు పెంచుతున్నప్పటికీ, చమురు కంపెనీలు ఇంకా భారీ నష్టాల (అండర్-రికవరీలు) ను భరిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మే 15 నాటి పెంపు వల్ల నష్టాలు 25 శాతం తగ్గినప్పటికీ, ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికీ రోజుకు దాదాపు రూ. 750 కోట్లు నష్టపోతున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ‘క్రిసిల్’ (CRISIL) అంచనాల ప్రకారం.. ప్రస్తుత పెంపుదల తర్వాత కూడా చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ. 10, డీజిల్‌పై రూ. 13 చొప్పున నష్టాలను చవిచూస్తున్నాయి. దీన్ని బట్టి రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
వాహనదారులకు ‘సీఎన్జీ’ షాక్
కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ ఇంధనమైన కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఢిల్లీలో మే 23న కిలో సీఎన్జీపై రూ. 1 పెంచడంతో, మే 15 నుంచి ఇప్పటివరకు మొత్తం పెంపుదల రూ. 4 కి చేరింది. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరల వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.