ముంబైలో మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో 20 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.

Tushar Gandhi Arrest: జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు, సామాజిక కార్యకర్త తుషార్ గాంధీని ముంబై పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జన్తా పార్టీ (సీజేపీ), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) చేపట్టనున్న నిరసనకు సంఘీభావంగా ముంబైలోని క్రాంతి మైదాన్‌లో ఆందోళన నిర్వహించేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
‘హమ్ భారత్ కే లోగ్’ సంస్థ అధ్యక్షుడిగా ఉన్న తుషార్ గాంధీ.. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు క్రాంతి మైదాన్‌లో నిరసన చేపట్టనున్నట్లు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రకటించారు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించి గామ్దేవి పోలీస్ స్టేషన్‌కు ఎలాంటి దరఖాస్తు అందలేదని, నిరసనకు అనుమతి కూడా మంజూరు చేయలేదని జోనల్ డీసీపీ రాగసుధ ఆర్ వెల్లడించారు.
క్రాంతి మైదాన్ ఆందోళనలు నిర్వహించేందుకు అనువైన ప్రదేశం కాదని, అక్కడ నిరసనలు చేపట్టకూడదంటూ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ కారణాలతోనే తుషార్ గాంధీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు అక్టోబరు 2న ముంబైలోని శివాజీ పార్క్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు.
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ, ఐసా నిర్వహించ తలపెట్టిన ఆందోళన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఈ సంస్థలు నిరసనకు పిలుపునిచ్చాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా 20 వేల మందికి పైగా పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. నిరసనలకు ఇంకా అనుమతి లభించకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో నిఘాను పెంచారు.
భద్రతా చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి నుంచే ఢిల్లీ మెట్రోకు చెందిన 45 స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేశారు. ఢిల్లీలోని రెండు ప్రధాన రైల్వే స్టేషన్లకు వెళ్లే రైళ్ల సేవలను సైతం రద్దు చేసినట్లు సమాచారం. నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
ఓటర్ల జాబితాలపై ఆరోపణలు, నిరసనలకు అనుమతుల వివాదం నేపథ్యంలో ముంబైతో పాటు ఢిల్లీలోనూ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.