కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వైసీపీ భారీ పోరాటానికి శ్రీకారం చుట్టింది. "వెన్నుపోటుకు రెండేళ్లు" అనే పేరుతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్, బుక్‌లెట్‌ను పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పాలనను నిరసిస్తూ వైఎస్సార్సీపీ భారీ పోరాటానికి శ్రీకారం చుట్టింది. "వెన్నుపోటుకు రెండేళ్లు" అనే పేరుతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్, బుక్‌లెట్‌ను పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, కల్పలతా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, అన్నాబత్తుని శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రెండేళ్లుగా దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా పాలన నడుస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యవస్థలన్నింటినీ తమ స్వంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ అవినీతికి తెరలేపారని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులను, ఈ కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే చేసి చూపెట్టిందని విమర్శించారు. తామిచ్చిన మోసపూరిత హామీలను అమలు చేయకుండా, అన్నీ పూర్తి చేసేశామంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, దీనిపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ ఈ ప్రభుత్వం చాపచుట్టేసిందని దుయ్యబట్టారు.
చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రజల్లో ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ అంచెలంచెలుగా నిరసన కార్యక్రమాలను ప్రకటించింది.
ప్రజలు నిజాలు తెలుసుకోవడానికి వీలుగా "వెన్నుపోటుకు రెండేళ్లు" బుక్లెట్, పోస్టర్లను క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. వీటిని డౌన్ లోడ్ చేసుకుని చుట్టుపక్కల వారితో చర్చించాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అందించిన రికార్డు స్థాయి సంక్షేమ పాలనకు, ప్రస్తుత అరాచక పాలనకు ఉన్న తేడాను గమనించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా పేదల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవని, ఇప్పుడు అదంతా సున్నా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళల రుణాలు గతంలో ₹49 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు ₹30 weల కోట్లకు పడిపోయాయని, మహిళలు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు.
మెగా డీఎస్సీ (Mega DSC) పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలను వైఎస్సార్సీపీ ఆధారాలతో సహా బయటపెట్టినా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడు లాగే పోటీలు, బ్రిడ్జి గేమ్‌ల ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందవచ్చని ఈ ప్రభుత్వం నిరూపించిందని ఎద్దేవా చేశారు. దీనిపై విద్యాశాఖ మంత్రి కనీసం నోరు విప్పడం లేదని, దానికి బదులుగా ఇసుక, బైజూస్ అంటూ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఇప్పుడు ఎత్తేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు మోసాలను తిప్పికొట్టేందుకు వైఎస్సార్సీపీ చేపట్టే ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు, మేధావులు, ఆలోచనాపరులతో పాటు సంక్షేమ పథకాలు కోల్పోయిన బాధితులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.