కేబినెట్ మీటింగ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యలోనే అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు (జూన్ 4) సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. అయితే, ఈ కేబినెట్ భేటీ జరుగుతుండగానే ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశం ముగియకుండానే అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
అయితే, దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. సమావేశం కొనసాగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ తీవ్రమైన వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డారని, ఆ నొప్పి భరించలేకనే ఆయన భేటీ నుంచి మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చిందని సమాచారం. కేబినెట్ నుంచి నేరుగా మంగళగిరిలోని తన పార్టీ క్యాంప్ ఆఫీస్కు చేరుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ కేబినెట్ భేటీకి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో సాగిన పాలనా తీరు, వివిధ శాఖల ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో కలిసి సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుతో పాటు, మంత్రుల పనితీరు ఎలా ఉంది? ప్రజల్లో ప్రభుత్వానికి వస్తున్న మైలేజ్ ఎంత? అనే విషయాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తూ, మంత్రుల పర్ఫార్మెన్స్పై వివరించే అవకాశం ఉంది.

ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన మరో అత్యంత కీలకమైన హామీ నెరవేర్చే దిశగా ఈరోజు కేబినెట్లో కీలక అడుగు పడనుంది. ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC) మరియు మైనార్టీ వర్గాల ప్రజలకు 50 ఏళ్ల వయసుకే వృద్ధాప్య పెన్షన్ అందిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కూటమి హామీ ఇచ్చింది. ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంలో.. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి నేటి మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణయం గనుక అమల్లోకి వస్తే రాష్ట్రంలోని లక్షలాది మంది వెనుకబడిన వర్గాల సామాన్యులకు పెద్ద ఊరట లభించినట్లవుతుంది.
మరోవైపు, ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు మేలు చేకూర్చే ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ ఏడాదికి సంబంధించిన ‘తల్లికి వందనం’ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 19వ తేదీన అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఈ పథకం కింద నిధులు నేరుగా జమ కానున్నాయి. స్కూళ్లు తెరిచే సమయంలో ఈ నిధులు అందనుండటం విద్యార్థుల కుటుంబాలకు ఎంతో ఆసరాగా మారనుంది.
18 May 2026

20 గంటల క్రితం