మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయానికి కీలక పాత్ర పోషించిన ఎంపీ సానా సతీష్ బాబు.. ఆర్నబ్, మురుసు తుపానుల సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు.

కూటమి విజయానికి సమన్వయంతో సానా సతీష్ వ్యూహరచన
అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు నిరంతర పర్యవేక్షణ
ఆర్నబ్, మురుసు తుపానుల వేళ బాధితులకు అండగా క్షేత్రస్థాయి పర్యటనలు
సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చొరవ
రాజకీయ వ్యూహరచనలోనూ.. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలవడంలోనూ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయానికి సమన్వయకర్తగా కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఆర్నబ్, మురుసు తుపానుల సమయంలో రాజకీయ కార్యక్రమాలకు పరిమితం కాకుండా నేరుగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. ఎన్నికల వ్యూహం నుంచి విపత్తు నిర్వహణ వరకు ఆయన వ్యవహరించిన తీరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా, జనసేన, భాజపాలకు వేర్వేరు ప్రాంతాల్లో బలమైన క్యాడర్ ఉంది. స్థానిక నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు, నియోజకవర్గాల వారీగా రాజకీయ సమీకరణాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉండటంతో కూటమి పార్టీల మధ్య సమన్వయంపై సానా సతీష్ ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల బదిలీ, క్షేత్రస్థాయి కార్యకర్తల సమష్టి కృషి విజయానికి కీలకమని భావించారు.
ఈ మేరకు అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరం ప్రాంతాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్ బాలయోగి సహా మూడు పార్టీల ముఖ్య నేతలతో చర్చించారు. మురమళ్లలో నిర్వహించిన కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
అభ్యర్థుల ఎంపికలో ప్రజాదరణ, గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఏ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా మిగిలిన భాగస్వామ్య పక్షాలు పూర్తి సహకారం అందించాలని, వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలోనూ సానా సతీష్ చురుకుగా వ్యవహరించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి అమలాపురం, రామచంద్రపురం ప్రాంతాల్లోని పలు వార్డుల్లో పర్యటించి ఓటర్లను కలిశారు. అమలాపురం ఛైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్, రామచంద్రపురం అభ్యర్థి మేడిశెట్టి శేషారావు, ముమ్మిడివరం అభ్యర్థి గుబ్బల గంగారత్న భవాని విజయానికి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎంపీ హరీష్ బాలయోగితో కలిసి చేపట్టిన భారీ బైక్ ర్యాలీ కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

ఈ సమన్వయ కృషి ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిఫలించింది.
అమలాపురంలో మొత్తం 36 వార్డులకు గాను కూటమి 30 స్థానాలను కైవసం చేసుకుంది. వీటిలో తెదేపా 18, జనసేన 11, భాజపా ఒక స్థానంలో విజయం సాధించాయి. ఛైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్ 11,979 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
రామచంద్రపురంలో కూటమి 27 స్థానాలను దక్కించుకుంది. ఛైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు 7,840 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ముమ్మిడివరం నగర పంచాయతీలో మొత్తం 23 వార్డులకు గాను కూటమి 18 స్థానాలను గెలుచుకుంది. తెదేపా 15, జనసేన మూడు స్థానాల్లో విజయం సాధించగా.. వైకాపా ఐదు వార్డులకే పరిమితమైంది. ఛైర్పర్సన్ అభ్యర్థి గుబ్బల గంగారత్న భవాని 2,299 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మున్సిపల్ ఎన్నికల కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలోనే ఆర్నబ్, మురుసు తుపానులు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ పరిస్థితుల్లోనూ సానా సతీష్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు. తెల్లవారుజామునే పర్యటనలు ప్రారంభించి అల్లవరం, గోపాయిలంక, గోడి, బెండమూరిలంక, ఓడలరేవు, కొమరగిరిపట్నం, నక్కా రామేశ్వరం తదితర మారుమూల గ్రామాల్లో పర్యటించారు.
ఓడలరేవు వద్ద తుపాను ధాటికి దెబ్బతిన్న సుమారు 200 బోట్లను పరిశీలించి మత్స్యకారులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. రైతులు, స్థానికుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులకు కల్పిస్తున్న వసతులు, ఆహార సరఫరాను పరిశీలించారు.
విద్యుత్తు, తాగునీరు, రహదారుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రహదారులపై విరిగిపడిన చెట్ల తొలగింపు పనుల్లోనూ స్వయంగా పాల్గొన్నారు. విద్యుత్తు సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వరకు అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకున్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సానా సతీష్ వివరించారు. రైతులకు జరిగిన పంట నష్టం, మత్స్యకారుల బోట్లు దెబ్బతినడం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు తక్షణ ఆర్థికసాయం అందించాలని, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణను వేగవంతం చేయాలని కోరారు. ఎన్నికల్లో కూటమి విజయానికి చేసిన కృషితో పాటు తుపాను సమయంలో చూపిన చొరవను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించినట్లు కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి.
రాజ్యసభ సభ్యుడిగా జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే సొంత ప్రాంత రాజకీయ సమీకరణాలు, ప్రజా సమస్యలపై సానా సతీష్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఒకవైపు మూడు పార్టీల మధ్య సమన్వయం సాధించి ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయడం.. మరోవైపు ప్రకృతి విపత్తుల సమయంలో బాధితుల వద్దకు వెళ్లి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం ఆయన నాయకత్వ శైలికి నిదర్శనమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రానున్న రోజుల్లో కూటమి రాజకీయాలతో పాటు ప్రాంత అభివృద్ధిలోనూ ఆయన మరింత కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.