2029 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే పరాజయం ఖాయమని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. కొచ్చి సభలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

2029 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓటమి పాలవడం ఖాయమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. దేశంలో వ్యవస్థాగత మార్పు కోసం ప్రజలంతా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం అధికార పక్షానికి అనుకూలంగా కాకుండా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వైఖరిని నిరసిస్తూ కేరళలోని కొచ్చిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నారు
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని దీప్కే ఆరోపించారు. ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కులను క్రమంగా కాలరాస్తోందని విమర్శించారు. ప్రజలు ఏం తినాలి, ఎవరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి అనే విషయాల్లో జోక్యం చేసుకున్న పాలకులు.. ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలో కూడా నిర్ణయించే స్థాయికి చేరుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకే సర్ ప్రక్రియను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు
ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న యువతపై అణచివేత ధోరణి కొనసాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో దేశ రాజధానిలో జాతీయ జెండా చేతబూనినందుకు తమను జైలుకు పంపారని గుర్తుచేశారు. తమపై అరాచక శక్తులనే ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చూపిన శాంతియుత, రాజ్యాంగబద్ధమైన మార్గంలోనే తాము పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను విమర్శించడం, పాలకులను ప్రశ్నించడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు.
కొచ్చిలో భారీ నిరసన ర్యాలీ
సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'జంతర్‌మంతర్ ఎట్ కొచ్చి' కార్యక్రమంలో భాగంగా స్థానిక రాజేంద్ర మైదానంలో నిరసన సభ జరిగింది. వివిధ యువజన, పౌరహక్కుల, సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సభకు ముందు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ నేతృత్వంలో మెరైన్ డ్రైవ్ నుంచి రాజేంద్ర మైదానం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.