Cyclone Arnab Update: బంగాళాఖాతంలో వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం. అక్టోబర్ 28న బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే సూచనలు, గంటకు 125 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రమాదం.

Cyclone Arnab Update: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నెల 28న బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసిన సమాచారం ప్రకారం, తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం విశాఖపట్నానికి 870 కిలోమీటర్లు, కాకినాడకు 960 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,060 కిలోమీటర్లు, బాపట్లకు 1,130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
వాయుగుండం ఆదివారం తీవ్ర వాయుగుండంగా, సోమవారం తుపానుగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 27 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా, 28వ తేదీ ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నానికి బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
తుపాను ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు, తీర ప్రాంతాల్లో ఉన్నవారు అధికారుల సూచనలను పాటించాలని కోరింది.
బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో జాగ్రత్తగా కట్టి ఉంచాలని సూచించింది. సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడే సమయంలో బీచ్‌ల వద్దకు వెళ్లడం, అలల దగ్గర సెల్ఫీలు దిగడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించింది.
తుపాను దిశ, తీవ్రతకు సంబంధించి వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసే తాజా సూచనలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనించాలని ప్రఖర్ జైన్ కోరారు. అధికారుల నుంచి వచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.