బిస్లెరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ ప్లాంట్ నీటి నమూనాల్లో కొలిఫార్మ్ బ్యాక్టీరియా గుర్తించడంతో ప్రాసిక్యూషన్‌కు అనుమతించింది.

పశ్చిమ బెంగాల్ ప్లాంట్‌లో నీటి నమూనాల్లో కొలిఫార్మ్ బ్యాక్టీరియా గుర్తింపు
గోవా యూనిట్‌పై చర్య తర్వాత తాజాగా మరో కేసు
నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ
న్యూఢిల్లీ: ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ బిస్లెరీకి భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మరోసారి షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో బిస్లెరీ ప్లాంట్ నుంచి సేకరించిన తాగునీటి నమూనాల్లో కొలిఫార్మ్ బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో కంపెనీపై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతించింది. వారం రోజుల్లోనే సంస్థపై రెండోసారి ఈ తరహా చర్యలు చేపట్టడం గమనార్హం. ఇటీవల గోవాలోని బిస్లెరీ ప్లాంట్ నుంచి సేకరించిన నీటి నమూనా కూడా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలడంతో అక్కడా చర్యలు ప్రారంభించారు.
జల్పాయిగురి జిల్లా టెలిపారా గ్రామంలోని బిస్లెరీ ప్లాంట్ నుంచి అధికారులు నీటి నమూనాలను సేకరించారు. వాటిని ప్రాథమిక ప్రయోగశాలతో పాటు రెఫరల్ ల్యాబొరేటరీలోనూ పరీక్షించగా రెండు చోట్లా కొలిఫార్మ్ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. నీటిలో ఈ బ్యాక్టీరియా ఉనికి మురుగునీటి లీకేజీలు, దెబ్బతిన్న పైపులైన్లు లేదా ఇతర మార్గాల ద్వారా కలుషితం జరిగి ఉండవచ్చని సూచిస్తుందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.
నమూనాల నాణ్యతపై సందేహాలు వ్యక్తం కావడంతో తొలుత పరీక్షలు నిర్వహించి, అనంతరం మరోసారి పరిశీలనకు పంపించారు. రెండు పరీక్షల్లోనూ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ తదుపరి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఆహార భద్రత చట్టంలోని నిబంధనల ప్రకారం బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది.
గోవా ప్లాంట్‌లోనూ నాణ్యతా లోపాలు
ఇటీవల గోవాలోని బిస్లెరీ ప్లాంట్ నుంచి సేకరించిన నీటి నమూనా కూడా నిర్దేశిత భద్రతా ప్రమాణాలను అందుకోలేదని పరీక్షల్లో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్టు 12న నాణ్యతపై ఆందోళనల నేపథ్యంలో బిస్లెరీ నీటి ఒక బ్యాచ్ విక్రయాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించింది. పరిశీలనలో ఉన్న కొన్ని నమూనాల్లో అనుమతించిన పరిమితికి మించి బ్రోమేట్తో పాటు పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు (పీఏహెచ్) ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. ఇవి ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 నిబంధనల ఉల్లంఘనలుగా పరిగణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రాథమిక పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత మరో ప్రయోగశాలలో నమూనాలను పరీక్షించేందుకు కంపెనీ అనుమతి కోరింది. అయితే రెండోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ కావడంతో చట్టపరమైన చర్యలకు మార్గం సుగమమైంది.
మా నీరు సురక్షితమే: బిస్లెరీ
మరోవైపు తమ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వినియోగానికి సురక్షితమైనదేనని బిస్లెరీ సోమవారం ప్రకటించింది. ఈ వ్యవహారంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ చేపట్టిన విచారణలో పూర్తిస్థాయిలో సహకరిస్తామని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఆహార, పానీయాల తయారీ సంస్థలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ తనిఖీలు, పర్యవేక్షణను మరింత పెంచిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని నెలలుగా ఆహార ఉత్పత్తుల తయారీదారులు, ఎనర్జీ డ్రింక్స్, మద్య పానీయాల తయారీ సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలపై కూడా తనిఖీలు, నిబంధనల అమలును కట్టుదిట్టం చేస్తోంది.