ఏపీకి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాల కల్పనపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నేత కొండా రాజీవ్‌గాంధీ డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్సీపీ విమర్శలు గుప్పించింది. ఈ పెట్టుబడులు ఎక్కడికి వచ్చాయి? ఎన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాయి? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అనే వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో విఫలమైందని రాజీవ్‌గాంధీ ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలపై వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 10 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, రూ.6,962 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 22 ఉద్యోగాలు మాత్రమే కల్పించారని కేంద్రం వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ వివరాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ముఖేశ్ అంబానీ, కరణ్ అదానీ, కుమార మంగళం బిర్లా, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, సంజీవ్ బజాజ్ వంటి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని గుర్తుచేశారు. ఇటీవల విశాఖలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు అదే స్థాయి పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారా అని ప్రశ్నించారు. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా చూపించి సదస్సు నిర్వహించారని ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, అధికార పార్టీ నేతల నుంచి ఎదురవుతున్నాయని చెబుతున్న 'ఎల్ ట్యాక్స్', 'ఎన్ ట్యాక్స్' వేధింపుల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్తున్నారని రాజీవ్‌గాంధీ ఆరోపించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెన్యూ పవర్ సంస్థకు మంజూరైన 600 మెగావాట్ల పవన విద్యుత్ అనుమతులను కూటమి ప్రభుత్వం జీవో నంబరు 56 ద్వారా రద్దు చేసిందని పేర్కొన్నారు. హీరో ఫ్యూచర్స్ సంస్థ రూ.30 వేల కోట్ల పెట్టుబడితో చేపట్టాలనుకున్న ప్రాజెక్టును రూ.15 వేల కోట్లకు కుదించారని, దానికి కూడా ఆటంకాలు సృష్టించారని విమర్శించారు.
2023-24తో పోలిస్తే 2025-26లో పారిశ్రామిక విద్యుత్ వినియోగం తగ్గిందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 0.15 శాతమేనని ఆయన పేర్కొన్నారు. పన్నుల ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరగలేదని ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాజీవ్‌గాంధీ విమర్శించారు. ప్రజా నాయకులపై మాట్లాడేటప్పుడు గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలని సూచించారు. వ్యాఖ్యల తీరు మార్చుకోకపోతే తాము కూడా అదే స్థాయిలో స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. పాలనపై దృష్టి పెట్టకుండా తప్పుడు ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.