APPSC LECTURER RECRUITMENT 2026: ఏపీలో డైట్, ఎస్సీఈఆర్టీ సంస్థల్లో 160 లెక్చరర్, సీనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబరు 18 నుంచి దరఖాస్తులు ప్రారంభం.

APPSC LECTURER RECRUITMENT 2026: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుభవార్త అందించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్), రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ)ల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్, సీనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 160 పోస్టులను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి నవంబరు 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
మొత్తం 160 ఖాళీల్లో డైట్ సంస్థల్లో 46 సీనియర్ లెక్చరర్ పోస్టులు, 104 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. ఎస్సీఈఆర్టీ పరిధిలో మరో 10 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సంబంధిత విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)తో పాటు నోటిఫికేషన్లో పేర్కొన్న బోధనా, వృత్తిపరమైన అర్హతలు కలిగి ఉండాలి. 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (సీబీటీ) ద్వారా నిర్వహించనున్నారు. పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు.
సీనియర్ లెక్చరర్ పోస్టులకు రూ.61,960 నుంచి రూ.1,51,370 వరకు వేతన శ్రేణి నిర్ణయించారు. డైట్ లెక్చరర్లకు రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు, ఎస్సీఈఆర్టీ లెక్చరర్లకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు వేతనాలు ఉంటాయి.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబరు 18న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై డిసెంబరు 8తో ముగియనుంది. పోస్టుల వారీగా విద్యార్హతలు, సిలబస్, పరీక్ష విధానం, రిజర్వేషన్లు, ఇతర నిబంధనల కోసం కమిషన్ విడుదల చేసిన పూర్తి నోటిఫికేషన్ను పరిశీలించాలని అధికారులు సూచించారు.