మురసు తుపానుతో ఏపీలో 1,302 కి.మీ. మేర ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నాయి. పునరుద్ధరణకు రూ.870.90 కోట్లు అవసరమని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

మురసు తీవ్ర తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 1,302 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. వీటి తాత్కాలిక పునరుద్ధరణకు రూ.98.70 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.772.22 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు వెల్లడించారు. మొత్తంగా రహదారుల పునరుద్ధరణకు రూ.870.90 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు.
తుపాను కారణంగా పది జిల్లాల్లో రహదారులకు ఎక్కువ నష్టం వాటిల్లింది. బాపట్ల జిల్లాలో అత్యధికంగా 332 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయి. గుంటూరులో 266 కి.మీ., ఎన్టీఆర్ జిల్లాలో 202 కి.మీ., పశ్చిమగోదావరిలో 122 కి.మీ., పల్నాడులో 93 కి.మీ., ఏలూరులో 75 కి.మీ., తూర్పుగోదావరిలో 68 కి.మీ., నెల్లూరులో 66 కి.మీ., కృష్ణాలో 59 కి.మీ., ప్రకాశం జిల్లాలో 17 కి.మీ. మేర రహదారులు దెబ్బతిన్నట్లు మంత్రి వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 158 ప్రాంతాల్లో రహదారులు కోతకు గురికాగా, 141 చోట్ల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. మరో 31 ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని కొట్టుకుపోగా, 30 చోట్ల మరమ్మతులు చేపట్టారు. 60 ప్రాంతాల్లో కల్వర్టు (సీడీ వర్క్స్) పనులు దెబ్బతినగా, 58 చోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు.
తుపాను ప్రభావంతో 207 ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా, అన్నిచోట్లా వాటిని తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేశారు. భారీ వర్షాల కారణంగా 120 చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, 116 ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించారు.
అధిక వరద ప్రవాహం కారణంగా తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు మంత్రి తెలిపారు. దెబ్బతిన్న రహదారులపై తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అవసరమైన నిధుల అంచనాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.