బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను బలపడుతోంది. శుక్రవారం నెల్లూరు–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే సూచనలున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాను మరింత బలపడుతోంది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ బుధవారం ఉదయానికి తీవ్ర తుపానుగా, గురువారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు–విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సీఈవో ప్రఖర్ జైన్ మంగళవారం తుపాను పరిస్థితిని వెల్లడించారు. దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను గత కొన్ని గంటలుగా ఒకే ప్రాంతంలో స్థిరంగా కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కి.మీ., మచిలీపట్నం, విశాఖపట్నాలకు 650 కి.మీ., ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కి.మీ. దూరంలో ఉందని వివరించారు.
తుపాను ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 100 నుంచి 110 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గురువారం నుంచి గాలుల తీవ్రత మరింత పెరిగి గంటకు 120 నుంచి 130 కి.మీ. వేగంతో వీస్తాయని, గరిష్ఠంగా 145 కి.మీ. వేగాన్ని అందుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొన్నారు. రైతులు పంటల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ పనుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తీరానికి చేరుకోవాలని సూచించింది. పడవలు, మోటారు బోట్లను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరిచి, బలమైన తాళ్లతో కట్టివేయాలని హెచ్చరించింది.
తుపాను కదలికలను ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సంయుక్తంగా 24 గంటలూ పర్యవేక్షిస్తున్నాయి. జిల్లా యంత్రాంగాలకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నాయి. అత్యవసర సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ప్రఖర్ జైన్ తెలిపారు.
తుపాను నేపథ్యంలో ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక వాతావరణ హెచ్చరికలను మాత్రమే అనుసరించాలని అధికారులు సూచించారు. మొబైల్ ఫోన్లు, అత్యవసర లైట్లను ముందుగానే ఛార్జింగ్ చేసుకోవాలి. ఆధార్, పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఇతర విలువైన పత్రాలను వాటర్‌ప్రూఫ్ కవర్లలో భద్రపరచుకోవాలి. కనీసం వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచుకోవాలి. ఇళ్ల పైకప్పులు, తలుపులు, కిటికీల పటిష్ఠతను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేసుకోవాలి.
తుపాను సమయంలో ఇంటి ప్రధాన విద్యుత్ స్విచ్‌ను, గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్లను ఆపివేయాలి. తలుపులు, కిటికీలు మూసి ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించేవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు సూచించిన వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి. తాగునీటిని కాచి చల్లార్చిన తర్వాతే వినియోగించాలి. బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే పాత భవనాలు, చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదు.
తుపాను ప్రభావం తగ్గిన వెంటనే ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అధికారుల నుంచి స్పష్టమైన సూచనలు వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. రోడ్లపై తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూలిన స్తంభాలకు దూరంగా ఉండాలి. వరద నీటిలో తడిసిన విద్యుత్ పరికరాలను నిపుణులైన ఎలక్ట్రీషియన్లు పరిశీలించిన తర్వాతే వినియోగించాలని అధికారులు హెచ్చరించారు.
తుపాను సమయంలో సహాయం అవసరమైనవారు వాట్సాప్/మన మిత్ర నంబరు 9552300009ను సంప్రదించవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101 ద్వారా కూడా అత్యవసర సహాయం పొందవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.