1,364 క్యాన్సర్ ఔషధాల కొత్త ఎంఆర్పీలు అమల్లోకి వచ్చాయి. 679 బ్రాండ్ల ధరలు 50 శాతానికి పైగా తగ్గడంతో వినియోగదారులకు ఏటా రూ.3,540 కోట్ల ఆదా కానుంది.

క్యాన్సర్ రోగులకు ఊరట కలిగించేలా 1,364 ఔషధ ఫార్ములేషన్ల గరిష్ఠ చిల్లర ధరలను (ఎంఆర్పీ) సవరించారు. ఈ కొత్త ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల వినియోగదారులకు ఏటా సుమారు రూ.3,540.38 కోట్లు ఆదా అవుతాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ వెల్లడించింది.
కేంద్ర ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) 137 క్యాన్సర్ ఔషధాలపై గరిష్ఠ వాణిజ్య మార్జిన్‌ను పరిమితం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్ఎస్) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అక్టోబరు 17, 2026న సమర్పించిన సిఫారసుల ఆధారంగా ధరల నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
నవంబరు 8, 2026 నాటికి 85 ఔషధ కంపెనీలు 121 ఔషధాలకు చెందిన 1,364 ఫార్ములేషన్ల కొత్త ఎంఆర్పీలను ప్రకటించాయి. వీటిలో 679 బ్రాండ్ల ధరలు 50 శాతానికి పైగా తగ్గాయి. అత్యధికంగా ఒక బ్రాండ్ ధర 96.45 శాతం తగ్గినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
సవరించిన ధరల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయడానికి మందుల దుకాణాలు, ఆసుపత్రుల ఫార్మసీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
మందుల ప్యాకెట్లపై ముద్రించిన కొత్త ఎంఆర్పీ ద్వారా ధరలను తెలుసుకోవచ్చు. అలాగే 'ఫార్మా సహీ దామ్' మొబైల్ యాప్, ఎన్పీపీఏ అధికారిక వెబ్సైట్ (nppa.gov.in)లోనూ వివరాలను పరిశీలించవచ్చు.
ఎవరైనా నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తే 'ఫార్మా జన్ సమాధాన్' పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఎన్పీపీఏ హెల్ప్‌లైన్ నంబరు 1800-111-255ను సంప్రదించాలని కేంద్రం సూచించింది.