Mahanadi Coalfields IPO: మహానది కోల్ఫీల్డ్స్ ఐపీఓ నవంబరు 19న ప్రారంభం. షేరు ధరల శ్రేణి రూ.129-136గా నిర్ణయం. ఐపీఓ తేదీలు, ధర, లిస్టింగ్ వివరాలు తెలుసుకోండి.

Mahanadi Coalfields IPO: ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) నుంచి మరో భారీ పబ్లిక్ ఇష్యూ మార్కెట్లోకి రానుంది. సంస్థ అనుబంధ కంపెనీ మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) ఐపీఓకు రంగం సిద్ధమైంది. నవంబరు 19 నుంచి 23 వరకు ఇన్వెస్టర్లు ఈ ఇష్యూలో పాల్గొనవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) ఐపీఓ విజయవంతమైన నేపథ్యంలో మరో అనుబంధ సంస్థ పబ్లిక్ ఇష్యూకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మహానది కోల్ఫీల్డ్స్ ఐపీఓ ద్వారా రూ.8,981 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేరుకు రూ.129 నుంచి రూ.136 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో జరగనుంది. ఇందులో భాగంగా మొత్తం 66.18 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. కంపెనీ కొత్తగా షేర్లను జారీ చేయడం లేదు. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం నవంబరు 18న బిడ్డింగ్ నిర్వహించనున్నారు. మిగిలిన ఇన్వెస్టర్లకు నవంబరు 19 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
గరిష్ఠ ధర రూ.136 ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.90 వేల కోట్లకు చేరవచ్చని అంచనా. ఐపీఓ ప్రక్రియ పూర్తయిన అనంతరం నవంబరు 27న బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ పబ్లిక్ ఇష్యూకు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, యాక్సిస్ క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్ మార్కెట్స్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ 1992లో ఏర్పాటైంది. దేశంలోని విద్యుత్, పారిశ్రామిక రంగాలకు అవసరమైన బొగ్గును సరఫరా చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. 2019లో మినీరత్న హోదా దక్కించుకుంది.
క్రిసిల్ నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 218.31 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే నాన్ కోకింగ్ బొగ్గులో సుమారు 22.4 శాతం వాటా మహానది కోల్ఫీల్డ్స్దే. ఈ నేపథ్యంలో సంస్థ ఐపీఓపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.