ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ పదవి నుంచి కల్యాణ్ కృష్ణమూర్తి వైదొలిగారు. తాత్కాలిక సీఈఓగా బాలాజీ త్యాగరాజన్ నియమితులయ్యారు.

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. సంస్థ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కల్యాణ్ కృష్ణమూర్తి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో గ్రూప్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న బాలాజీ త్యాగరాజన్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించింది. ఈ మార్పును సంస్థ బుధవారం ప్రకటించింది. అయితే కల్యాణ్ కృష్ణమూర్తి వైదొలగడానికి గల కారణాలను వెల్లడించలేదు.
ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ సంస్థ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత 2017లో కల్యాణ్ కృష్ణమూర్తి కీలక బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2018లో గ్రూప్ సీఈఓగా నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో ఫ్లిప్‌కార్ట్ దేశీయ ఈ-కామర్స్ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. అమెజాన్, మీషో వంటి సంస్థల నుంచి పోటీ ఎదురవుతున్నప్పటికీ మార్కెట్లో తన ఉనికిని నిలబెట్టుకునేందుకు పలు వ్యూహాలు అమలు చేసింది.
యువతను ఆకర్షించేలా కొత్త ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు క్విక్ కామర్స్ రంగంలోనూ సంస్థ అడుగులు వేసింది. బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలకు పోటీగా 'ఫ్లిప్‌కార్ట్ మినిట్స్' సేవలను ప్రారంభించింది. కొత్త వ్యాపార విభాగాల్లోకి విస్తరించే ప్రయత్నాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
కల్యాణ్ కృష్ణమూర్తి నిష్క్రమణకు సంబంధించి అధికారిక కారణాలు వెల్లడికాలేదు. అయితే ఫ్లిప్‌కార్ట్ ఐపీఓ ప్రణాళికలో జాప్యం, మాతృసంస్థ వాల్‌మార్ట్‌తో వ్యూహాత్మక విభేదాలు వంటి అంశాలు పరిశ్రమ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. సంస్థ స్టాక్ మార్కెట్లో నమోదయ్యే ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ల (ఈఎస్ఓపీలు) ద్వారా లబ్ధి పొందే అవకాశం కూడా వాయిదా పడుతోందన్న అసంతృప్తి ఉద్యోగుల్లో ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా ఫ్లిప్‌కార్ట్‌లో పలువురు ఉన్నతస్థాయి అధికారులు సంస్థను వీడటం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కల్యాణ్ కృష్ణమూర్తి వైదొలగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త తాత్కాలిక సీఈఓ బాలాజీ త్యాగరాజన్ నాయకత్వంలో సంస్థ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుందో, ఐపీఓ ప్రక్రియపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.