అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు కలెక్టర్ పై మనసు పడ్డారు. దీంతో ఆ మహిళా కలెక్టర్ కు ఎమ్మెల్యే తప్పుడు మెసేజులు పంపారు. అయితే ఈ విషయం ప్రస్తుతం సీఎం వరకు వెళ్లింది. దీనిపై సీఎం ఏం చేస్తారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తమిళనాడులో అధికార టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్‌పై మహిళా ఐఏఎస్ అధికారి, కళ్లకురిచి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. తనకు అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు పంపడంతో పాటు, బహిరంగ కార్యక్రమాల్లో అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు నవంబరు 23న జిల్లా ఎస్పీకి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారం సుమారు మూడు నెలల క్రితమే జరిగినట్లు సీనియర్ ఐఏఎస్ అధికారిణి కవితా రాము వెల్లడించారు. కలెక్టర్ ఎదుర్కొన్న పరిస్థితులు ఆమెకు, కుటుంబ సభ్యులకు తీవ్ర మానసిక వేదన కలిగించాయని ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. నవంబరు 11న కలెక్టర్‌తో మాట్లాడినప్పుడు ఈ విషయం ఉన్నతస్థాయిలో చర్చకు వచ్చిందని, తగిన చర్యల ప్రక్రియ కొనసాగుతోందని ఆమె చెప్పినట్లు వివరించారు.
మరో జిల్లాకు బదిలీ కావాలని ప్రధాన కార్యదర్శి గతంలో సూచించినప్పటికీ, కళ్లకురిచిలోనే కొనసాగాలని కలెక్టర్ నిర్ణయించుకున్నట్లు కవితా రాము వెల్లడించారు. తొలుత ఫిర్యాదు చేయడానికి కూడా ఆమె వెనుకాడినట్లు తెలిపారు.
తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ ఖండించారు. అధికారులంటే తనకు గౌరవమని, కలెక్టర్‌కు అనుచిత సందేశాలు పంపలేదని గతంలో మీడియా ఎదుట స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఇప్పటికే స్పందించింది. తమిళనాడు డీజీపీకి లేఖ రాసి నిష్పాక్షిక విచారణ జరపాలని, సంబంధిత డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని ఆదేశించింది. విచారణలో రాజకీయ లేదా ఇతర ప్రభావాలకు తావుండకూడదని స్పష్టం చేసింది.
ఈ కేసుపై మద్రాస్ హైకోర్టు కూడా విచారణ చేపట్టింది. ఐజీ స్థాయి లేదా అంతకంటే ఉన్నతాధికారి పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని, కార్యాలయ వేధింపుల అంశంపై స్వతంత్ర సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి అంతర్గత ఫిర్యాదుల కమిటీ ద్వారా ప్రత్యేక విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించినట్లు సమాచారం. తదుపరి విచారణను నవంబరు 27కు వాయిదా వేసింది.
మహిళా అధికారిణి చేసిన ఆరోపణలు, ఎమ్మెల్యే ఖండన నేపథ్యంలో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం, బాధిత అధికారిణి గౌరవం, భద్రతను కాపాడటం ప్రభుత్వానికి కీలకంగా మారింది.