ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది. పెంచిన వయోపరిమితి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండనుంది. ఈ వయోపరిమితి సడలింపు ఏపీపీఎస్సీతో పాటు ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీలు చేపట్టే నియామకాలకు వర్తించనుంది.
నాన్-యూనిఫామ్ సర్వీసులకు ప్రస్తుతం ఉన్న గరిష్ఠ వయోపరిమితి 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరిగింది. ఇతర నియామకాల్లో సాధారణ కేటగిరీ అభ్యర్థులకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచారు.
అయితే యూనిఫామ్ సర్వీసులకు సాధారణ కేటగిరీలో ఈ వయోపరిమితి పెంపు రెండేళ్లపాటు మాత్రమే వర్తించనుంది. రిజర్వ్డ్ కేటగిరీలకు ఇప్పటికే అమల్లో ఉన్న వయోపరిమితి సడలింపులు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టులకు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొత్తం 20 శాఖలకు సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మరో ఐదు శాఖలకు సంబంధించిన పోస్టులకు రేపు నోటిఫికేషన్లు విడుదల చేయనుండగా, మరో పది శాఖలకు సంబంధించిన పోస్టులకు ఈ నెల 24న నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సమాచారం.
అటవీశాఖలో పలు కీలక పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 4 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు, 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు, 20 డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్-2 పోస్టులు, 26 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
అలాగే సూపర్వైజర్ గ్రేడ్-1 పోస్టులు 29 భర్తీ చేయనున్నారు.
మహిళా శిశు సంక్షేమశాఖలో 78 ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులు, 15 డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఎండోమెంట్స్ విభాగంలో 104 గ్రేడ్-3 ఈవో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా పరిశీలించాలని అధికారులు సూచించారు. సంబంధిత నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర అర్హతలు, దరఖాస్తు గడువు వంటి వివరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.