చంద్రబాబు నాయుడును ‘వాటర్ మ్యాన్’గా మంత్రి నిమ్మల రామానాయుడు అభివర్ణించారు. పోలవరం, హంద్రీ-నీవా, వెలిగొండ, నదుల అనుసంధానంపై సీఎం దృష్టిని వివరించారు.

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న దార్శనిక నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంసించారు. జల వనరుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, నీటి సంరక్షణలో ఆయన చూపుతున్న చొరవను గుర్తించి చంద్రబాబును ‘వాటర్ మ్యాన్’గా అభివర్ణించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు.
సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కాంక్లేవ్‌లో మంత్రి నిమ్మల ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ అవసరాలు, రాష్ట్ర భవిష్యత్తుపై చంద్రబాబు నాయుడికి ఉన్న అవగాహన ప్రత్యేకమైనదని పేర్కొన్న మంత్రి, జల వనరుల రంగంలో ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమాలను సుదీర్ఘంగా వివరించారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందే వ్యవసాయం, నీటి పొదుపు ప్రాధాన్యతను గుర్తించారని నిమ్మల తెలిపారు.
1990వ దశకంలో కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రవేశపెట్టారని, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే విధానాలను ప్రోత్సహించారని చెప్పారు.
ఇజ్రాయెల్ తరహా ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని, అనంతరం రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్‌ను విస్తరించి నీటి పొదుపుపై రైతుల్లో అవగాహన కల్పించారని మంత్రి పేర్కొన్నారు.
1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను చంద్రబాబు గుర్తించారని నిమ్మల అన్నారు.
గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలు నీటి వనరుల కారణంగా ఆర్థికంగా అభివృద్ధి చెందగా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు నీటి కొరత కారణంగా వెనుకబడ్డాయని ఆయన గుర్తించారని తెలిపారు.
మెట్ట భూముల్లో కూడా సాగును విస్తరించేందుకు భూగర్భ జలాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ బోరుబావులకు సబ్సిడీ విద్యుత్‌ను అందించారని, అనంతరం ఉచిత విద్యుత్ విధానాన్ని అమలు చేశారని చెప్పారు.
దీంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి మెట్ట ప్రాంతాల్లోనూ వ్యవసాయ అభివృద్ధి సాధ్యమైందని నిమ్మల వివరించారు.
విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు జల వనరులపై మరింత దృష్టి సారించారని మంత్రి తెలిపారు.
ప్రముఖ ఇంజనీర్ కె.ఎల్.రావు ప్రతిపాదించిన నదుల అనుసంధానం ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబును నిమ్మల కొనియాడారు.
అధికంగా ఉన్న నీటిని అవసరం ఉన్న ప్రాంతాలకు తరలించడం, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడం, ప్రతి ఎకరాకు నీరు అందించడం, రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చడం చంద్రబాబు లక్ష్యమని అన్నారు.
2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలోని అనేక సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని నిమ్మల తెలిపారు.
రాష్ట్ర జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు పనులను 72 శాతం వరకు పూర్తి చేశామని పేర్కొన్నారు. రాయలసీమలోని వివిధ ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు ఖర్చు చేశామని, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.
పోలవరం పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా గోదావరి వరద జలాలను పట్టిసీమ, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణా డెల్టాకు తరలించారని తెలిపారు.
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయడం ద్వారా దేశంలోనే నదుల అనుసంధానానికి ఒక ముఖ్యమైన ముందడుగు వేశారని నిమ్మల అన్నారు.
2019 తర్వాత ప్రభుత్వం మారడంతో రాష్ట్ర సాగునీటి రంగానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని నిమ్మల విమర్శించారు.
అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయని, నిర్మాణాలు మందగించాయని, నీటిపారుదల రంగంలో విలువైన ఐదేళ్ల సమయం వృథా అయిందని ఆరోపించారు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి తెలిపారు.
ప్రతి ప్రాజెక్టు పూర్తికి ఇరిగేషన్ క్యాలెండర్, టైమ్‌లైన్ రూపొందించి పనులను వేగవంతం చేశామని చెప్పారు.
గత రెండేళ్లలో సుమారు రూ.30 వేల కోట్ల ఇరిగేషన్ బడ్జెట్ కేటాయింపుల్లో దాదాపు సగం రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించినట్లు తెలిపారు.
హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసి, సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలించామని నిమ్మల తెలిపారు.
మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు కలను ఆగస్టు 31న సాకారం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని అన్నారు.
అదేవిధంగా సెప్టెంబర్ 2న పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి వరకు పంపడం ఉత్తరాంధ్ర చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్నారు.
రాష్ట్ర దశాదిశలను మార్చే జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని 2027 మార్చి నాటికి ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించడం ఆయన నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని నిమ్మల అన్నారు.
రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో 36 సాగునీటి ప్రాజెక్టులను ఎంపిక చేశామని, వాటిని 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఈ ప్రాజెక్టుల కోసం రూ.36,555 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు.
భూగర్భాన్ని కూడా జలాశయంగా మార్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు.
2014-19 మధ్య కాలంలో వివిధ నీటి సంరక్షణ చర్యల కారణంగా భూగర్భ జల మట్టాలు 2 నుంచి 2.5 మీటర్ల మేర పెరిగాయని పేర్కొన్నారు.
నీరు-చెట్టు కార్యక్రమం కింద 38,500 చెరువులను లోతు తవ్వడం, గట్లు బలోపేతం చేయడం వంటి పనులు చేపట్టడంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన జలధార జలహారతి కార్యక్రమం కింద ఇప్పటివరకు సుమారు 90 వేల పనులు పూర్తి చేశామని నిమ్మల తెలిపారు.
ఈ పనుల ద్వారా దాదాపు 80 టీఎంసీల అదనపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచగలిగామని చెప్పారు.
అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సమర్థంగా వినియోగించుకుని రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వివరించారు.
సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, భూగర్భ జలాల సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యం పెంపు వంటి రంగాల్లో చంద్రబాబు నాయుడు చేపట్టిన చర్యల కారణంగానే ఆయనను ‘వాటర్ మ్యాన్’గా అభివర్ణించడం సమంజసమని మంత్రి నిమ్మల అన్నారు.
ప్రతిష్టాత్మక ది ఎకనామిక్ టైమ్స్ చంద్రబాబు నాయుడిని ‘వాటర్ మ్యాన్’గా పేర్కొనడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహితంగా మార్చి, జల వనరులను వ్యవసాయాభివృద్ధికి, సంపద సృష్టికి ఉపయోగించాలన్న చంద్రబాబు నాయుడు దీర్ఘకాలిక దృక్పథం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.