వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంతంలో సాగు, తాగునీరు, వ్యవసాయం, ఉద్యానవనం, ఉపాధి అవకాశాలు పెరిగి సమగ్ర అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు పూర్తవడంతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు సమూలంగా మారనున్నాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సాగునీరు, తాగునీటి భద్రతతో పాటు వ్యవసాయం, ఉద్యానవనం, ఉపాధి రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడి ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చరిత్ర సృష్టించాలన్నా.. గత చరిత్రను తిరగరాయాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సాధ్యమని మంత్రి పేర్కొన్నారు. వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడం, హార్టికల్చర్ హబ్లో చేర్చడం, మూడు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించే స్థాయికి తీసుకురావడం చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమైందన్నారు.
మార్కాపురం ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కానుందని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు ఇది అత్యంత చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు.
వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న మార్కాపురం ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారానికి మార్గం చూపుతుందని మంత్రి అన్నారు.
వెలిగొండ ప్రాజెక్టుకు నికర జలాలు సాధించేందుకు తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు.
ప్రాంతీయ ప్రజల ప్రయోజనాల కోసం అప్పట్లో చేసిన పోరాటం ఫలించిందన్నారు.
అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వ కాలంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు దెబ్బతిన్నాయని విమర్శించారు.
ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యం వహించిన వైసీపీ నేతలకు వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి అన్నారు.
కొండలను బద్దలు కొట్టి కరువు ప్రాంతాల్లోకి నీటిని తీసుకెళ్లిన చరిత్ర చంద్రబాబు నాయుడిదేనని గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తవడంతో మార్కాపురం ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ రంగం గణనీయంగా మెరుగుపడతాయని తెలిపారు.
సాగునీటి లభ్యత పెరగడంతో వ్యవసాయ రంగానికి భరోసా ఏర్పడటంతో పాటు ఉద్యాన పంటలకు కూడా మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు.
నిర్వాసిత కుటుంబాలకు కేవలం 48 రోజుల్లో రూ.768 కోట్ల పరిహారం అందించడం రికార్డుగా నిలిచిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో ప్రభావితమైన కుటుంబాల పునరావాసం, పరిహారం అంశాలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ప్రకాశం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటి భద్రత మరింత బలోపేతమవుతుందని మంత్రి చెప్పారు.
నీటి లభ్యత పెరగడంతో వ్యవసాయం, ఉద్యానవనం అభివృద్ధి చెందడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. మార్కాపురం ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మూడు దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న కల సాకారం అవుతున్న నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మారనుందని గొట్టిపాటి రవికుమార్ అన్నారు.