సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిల ప్రారంభంతో అమరావతికి మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. ఐదు కాన్సెప్టులతో ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు.

అమరావతి: రాజధాని అమరావతికి మెరుగైన రహదారి కనెక్టివిటీ కల్పించే కీలక ప్రాజెక్టులో భాగంగా సీడ్ యాక్సెస్ రహదారి ఈ-3, బకింగ్‌హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. రాజధాని నిర్మాణంలో సీడ్ యాక్సెస్ రోడ్డు మొదటి మెట్టని, ఇది అమరావతికి రాజమార్గంగా నిలుస్తుందని సీఎం అన్నారు.
ఉండవల్లి వద్ద విజయవాడ-మంగళగిరి-గుంటూరుతో అమరావతిని అనుసంధానించే సీడ్ యాక్సెస్ రహదారిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాయపూడి నుంచి వెంకటపాలెం, పెనుమాక మీదుగా ఉండవల్లి వరకు ఈ రహదారిని సీఆర్డీఏ నిర్మించింది. రహదారికి అనుసంధానంగా బకింగ్‌హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను కూడా సీఎం ప్రారంభించారు.
ప్రారంభోత్సవానికి సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రులు పి. నారాయణ, నాదెండ్ల మనోహర్‌తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం స్టీల్ బ్రిడ్జిలతో పాటు సీడ్ యాక్సెస్ రహదారిని సీఎం కాలినడకన పరిశీలించారు.
సీడ్ యాక్సెస్ రహదారిని మూడో దశలో మణిపాల్ ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారి-16కు అనుసంధానం చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు సీఎం తెలిపారు. ఈ పనులకు రూ.1,519 కోట్ల వ్యయం కానుందని చెప్పారు.
బ్రిడ్జిల ప్రారంభంతో అమరావతికి రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, రాజధాని నిర్మాణానికి మెరుగైన రహదారి వ్యవస్థ పునాదిగా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి విజన్‌లో అమరావతి నిర్మాణం తొలి విజయమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజలు గర్వించేలా సైబరాబాద్‌ను నిర్మించామని, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా పోయిందని గుర్తుచేశారు.
25 పార్లమెంట్ స్థానాల మధ్యలో ఉన్న గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించామని తెలిపారు. విస్తృత చర్చల అనంతరం రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో రాజధాని కోసం భూములు ఇచ్చారని చెప్పారు.
“రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. రైతులది త్యాగం కాదు.. స్ఫూర్తి” అని చంద్రబాబు అన్నారు.
అమరావతి బృహత్ ప్రణాళికకు సింగపూర్ ఉచితంగా సహకరించిందని, గత పాలకులు ప్రజలతో పాటు సింగపూర్ ప్రతినిధులను కూడా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.
ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలకు ప్రత్యేకమైన డిజైన్లు రూపొందించామని, అయితే కొందరు వాటిని ‘గ్రాఫిక్స్’ అంటూ ఎగతాళి చేశారని అన్నారు. ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ వాస్తవ రూపం దాల్చుతున్నాయని, ఎగతాళి చేసినవారు తలలు దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.
అమరావతిని పూర్తిగా కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేయడంతో పాటు డీప్‌టెక్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు.
రాజధాని నిర్మాణంలో ఐదు ప్రధాన కాన్సెప్టులను అమలు చేస్తున్నట్లు చెప్పారు:
అమరావతిని ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామని, దేశంలోని టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు చెప్పారు.
అమరావతి, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు రాజధాని పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు.
అమరావతి కోసం 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
2028 నాటికి భారత్ మెచ్చే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్ది, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు.
సింధూ నాగరికతలోని ప్రణాళికాబద్ధమైన రహదారి వ్యవస్థ తరహాలో అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు.
“ఇక అమరావతి అన్‌స్టాపబుల్” అని చంద్రబాబు ప్రకటించారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ చేతిలో జాతీయ జెండా, మనస్సులో స్పష్టమైన అజెండాతో భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా, వచ్చే 21 ఏళ్లలో భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రజలు తమ వంతు కృషి చేయాలని కోరారు.
రైతులు, విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు తమ తమ రంగాల్లో అత్యుత్తమంగా పనిచేయాలని సూచించారు.
ప్రతి ఇంటిపై, ప్రతి వాణిజ్య సంస్థపై జాతీయ జెండా ఎగరాలని, మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తిరంగా ర్యాలీలు ప్రజా ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు.
అమరావతి అభివృద్ధికి ప్రజలు తమ ఆలోచనలు, సూచనలు అందించాలని సీఎం కోరారు. అమరావతి రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమం అనంతరం చంద్రబాబు నాయుడు రాయపూడి వద్ద నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రులు పి. నారాయణ, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితరులు ముఖ్యమంత్రితో కలిసి భవన సముదాయాన్ని పరిశీలించారు.