మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నానికి మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. రాజకీయాల్లో హుందాతనానికి నాని ప్రతీకగా నిలిచారని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

ఏలూరు: మాజీ ఉపముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) మృతి తీవ్రంగా బాధించిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆళ్ల నాని పార్థివదేహానికి గురువారం ఏలూరులోని ఆయన నివాసంలో నివాళులర్పించిన లోకేష్.. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. ఆళ్ల నాని రాజకీయ జీవితాన్ని, ప్రజా సేవను గుర్తు చేసుకున్నారు.
ఆళ్ల నాని మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎమ్మెల్సీగా ఉన్నానని నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో అనేక అంశాలపై నానితో చర్చించేవాడినని, అయితే ఆయన ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా హుందాతనంతో వ్యవహరించేవారని గుర్తుచేశారు.
రాజకీయాల్లో రాజనీతి, హుందాతనం ఉండాలని బలంగా విశ్వసించిన వ్యక్తి ఆళ్ల నాని అని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉంటూ, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారి సమస్యల గురించి మాట్లాడేందుకు వినియోగించాలనే భావనతో ఆయన పనిచేసేవారని అన్నారు.
ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ఆళ్ల నాని చేసిన సేవలు చిరస్మరణీయమని లోకేష్ అన్నారు.
ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ప్రజలకు సేవ చేయడానికి, తన నియోజకవర్గ అభివృద్ధికి నాని అహర్నిశలు కృషి చేశారని తెలిపారు.
ఆళ్ల నాని టీడీపీలో చేరిన సమయంలో ఆయనతో జరిగిన సంభాషణను నారా లోకేష్ గుర్తుచేశారు.
“ఐదేళ్లుగా మిమ్మల్ని దగ్గరుండి చూసిన వ్యక్తిని. మీరు ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటే వ్యక్తి కాదు. క్రమశిక్షణ అనే పాఠశాల మీది. మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో నడుచుకునే తీరును చూసి మాలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పాను” అని లోకేష్ పేర్కొన్నారు.
అలాంటి మంచి వ్యక్తి తమ మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు.
ఆళ్ల నాని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆళ్ల నాని అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. మంత్రి కొలుసు పార్థసారథి అక్కడే ఉండి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తరఫున ఆళ్ల నానికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్న నారా లోకేష్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, మద్దిపాటి వెంకటరాజు, సొంగా రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.