చంద్రబాబు నాయుడి అరెస్టు జరిగిన సెప్టెంబర్ 9ను తెలుగు జాతి చరిత్రలో చీకటి రోజుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభివర్ణించారు.

అమరావతి, సెప్టెంబర్ 9: సెప్టెంబర్ 9 తెలుగు జాతి చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని చీకటి రోజని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులో అరెస్టు చేసి 53 రోజులపాటు నిర్బంధించారని గుర్తుచేశారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ‘నిజం గెలవాలి’ నినాదంతో ఆయనకు అండగా నిలిచారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల సంఘీభావం చంద్రబాబుపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఎన్ని కుట్రలు, అవరోధాలు ఎదురైనా చంద్రబాబు నీతి, నిజాయితీ, ప్రజాసేవను అణచివేయలేకపోయారని అన్నారు. అనంతరం ఆయన విడుదల కావడం, న్యాయస్థానాల్లో కేసులకు ఎదురుదెబ్బలు తగలడం ద్వారా చివరకు నిజం గెలిచిందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నిర్బంధ సమయంలో ప్రజలు చూపిన ఐక్యత ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆ చీకటి రోజుల్లో చంద్రబాబుకు అండగా నిలిచిన తెలుగు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.