మెగా డీఎస్సీపై వైసీపీ, సాక్షి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. మాజీ సైనికుడు చక్రపాణి రెడ్డిపై దౌర్జన్యాన్ని ఖండించారు.

మంగళగిరి: మెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని కోటంరెడ్డి అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో గత ప్రభుత్వం విఫలమైందని, అమరావతి నిర్మాణాన్ని నిలిపివేయడంతో పాటు పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను కూడా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గత ఐదేళ్లలో కొత్త పరిశ్రమలు, పెద్ద ఎత్తున పెట్టుబడులు రాకపోవడంతో రాష్ట్ర అభివృద్ధి వేగం మందగించిందన్నారు.
2024 ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఆ పార్టీని 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేశారని కోటంరెడ్డి పేర్కొన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించారని అన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు అధికారాన్ని అప్పగించారని, ప్రస్తుతం అమరావతి, పోలవరం సహా కీలక ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 148 రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క సంతకంతో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని కోటంరెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఈ నియామకాలు పారదర్శకంగా జరిగాయని అన్నారు.
వైఎస్సార్సీపీ ఈ నియామకాలను ‘దగా డీఎస్సీ’గా ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది ప్రజా డీఎస్సీ, యువ డీఎస్సీ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని, అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికుడు చక్రపాణి రెడ్డిపై వైఎస్సార్సీపీ శ్రేణులు, సాక్షి మీడియా ప్రతినిధులు దౌర్జన్యానికి పాల్పడ్డారని కోటంరెడ్డి ఆరోపించారు.
ఎక్స్-సర్వీస్మెన్, స్పోర్ట్స్, ఈడబ్ల్యూఎస్ కోటాల్లో నిబంధనల ప్రకారం చక్రపాణి రెడ్డి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారని ఆయన తెలిపారు. ఆయన మెడల్స్, సర్టిఫికెట్లపై అనుమానాలు ఉంటే పోలీసులకు లేదా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాల్సిందని అన్నారు.
“విచారణ చేయడానికి సాక్షి టీవీ, వైఎస్సార్సీపీ నాయకులు సీబీఐ అధికారులా?” అని కోటంరెడ్డి ప్రశ్నించారు.
మాజీ సైనికుడిపై బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వేముల రామకృష్ణ విషయంలోనూ వైఎస్సార్సీపీ, సాక్షి మీడియా నిరాధార ఆరోపణలు చేశాయని కోటంరెడ్డి అన్నారు.
రామకృష్ణ తప్పుడు సర్టిఫికెట్లతో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం పొందారని ప్రచారం చేశారని, అయితే ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని స్పష్టం చేశారని తెలిపారు.
తాను పరీక్ష రాసినా సరైన ప్రిపరేషన్ లేక అర్హత సాధించలేదని, ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మళ్లీ పరీక్షకు సిద్ధమవుతున్నానని రామకృష్ణ వెల్లడించారని చెప్పారు. ఈ ఘటన వైసీపీ చేస్తున్న ఆరోపణల తీరును బయటపెట్టిందని కోటంరెడ్డి అన్నారు.
మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా హైకోర్టులో 335 కేసులు వేయించారని ఆయన ఆరోపించారు. న్యాయస్థానం ఆ పిటిషన్లను కొట్టివేసిందని పేర్కొన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ వైఎస్సార్సీపీకి నష్టం జరుగుతోందని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.
“జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి ప్రెస్మీట్ పెడితే పార్టీకి కనీసం లక్ష ఓట్లు నష్టం జరుగుతోందని ఆ పార్టీ నేతలే అంతర్గతంగా వాపోతున్నారు” అని ఆయన అన్నారు.
తాను గతంలో జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో హితవు చెబుతున్నానని, ఇప్పటికైనా ఆధారాలు, వాస్తవాలతో మాట్లాడాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తోందని కోటంరెడ్డి తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు అసూయపడే స్థాయిలో ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు.
రాబోయే ఐదేళ్ల నుంచి పదేళ్లలో విద్యార్థులు, యువత భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, మెగా డీఎస్సీ ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పారు.
వైఎస్సార్సీపీ, సాక్షి మీడియా చేస్తున్న ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు.