రాఖీ పండుగను రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు వినూత్నంగా జరుపుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన జెన్-జీ యువతులతో రాఖీ వేడుకలు నిర్వహించారు.

కాకినాడ: రాఖీ పండుగను పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు జెన్‌జీ యువతతో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. కొప్పవరం కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాశాల విద్యార్థినులు పాల్గొని ఎంపీకి రాఖీలు కట్టారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం చేస్తూ సరదాగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా విద్యార్థినుల ఆకాంక్షలు, కెరీర్ లక్ష్యాలు, విద్య, ఉపాధి అవకాశాలు, కాకినాడ అభివృద్ధిపై వారి ఆలోచనలను సానా సతీష్‌బాబు అడిగి తెలుసుకున్నారు. జెన్‌జీ యువతతో వారి శైలిలోనే ఆత్మీయంగా సంభాషిస్తూ.. భవిష్యత్ ప్రణాళికలపై ఆరా తీశారు.
కాకినాడలో యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త తరహా అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, యువనేత, మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న యువతకు రాఖీ శుభాకాంక్షలు తెలిపి గిఫ్టులు, చాక్లెట్లు అందజేశారు. రాఖీ వేడుకలను కేవలం పండుగ కార్యక్రమంగా కాకుండా.. యువత ఆలోచనలు, ఆకాంక్షలను తెలుసుకునే వేదికగా నిర్వహించినట్లు సానా సతీష్‌బాబు తెలిపారు. భవిష్యత్ కాకినాడపై యువత అభిప్రాయాలను తెలుసుకోవడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు.