ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50 విద్యుత్ సబ్సిడీని ఆక్వా, నాన్-ఆక్వా జోన్ తేడా లేకుండా అమలు చేస్తున్నట్లు మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది రైతులకు ప్రయోజనం కలగనుంది.

పాలకొల్లు: ఆక్వా రైతులకు విద్యుత్ భారాన్ని తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్వా జోన్, నాన్-ఆక్వా జోన్ అనే తేడా లేకుండా అర్హులైన ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ పై యూనిట్ రూ.1.50 కే అందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
పాలకొల్లు బ్రాడీపేట బైపాస్ రోడ్డులో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఆక్వా రైతుల కృతజ్ఞత మహాసభలో అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 10 ఎకరాలకు పైగా ఆక్వా సాగు చేస్తున్న అర్హులైన రైతులకు యూనిట్‌కు రూ.1.50 సబ్సిడీని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన జీవో ఆర్టీ ఇప్పటికే విడుదల చేసినట్లు తెలిపారు.
ఆక్వా రంగాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం
ఆక్వా రంగం ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు ఎంతో ప్రాధాన్యమైన రంగమని అచ్చెన్నాయుడు అన్నారు. ఆక్వా రంగాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో 99 శాతం హామీలను అమలు చేశామని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
విద్యుత్ వ్యవస్థ ఆధునికీకరణకు రూ.500 కోట్లు
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది తీవ్రమైన ఎండల కారణంగా విద్యుత్ వినియోగం పెరగడంతో ఆక్వా రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణం చేపట్టామని, అనంతరం విద్యుత్ రంగంలో నిర్లక్ష్యం కారణంగా వ్యవస్థలో సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణాన్ని వేగవంతం చేశామని తెలిపారు.
ఉండి నియోజకవర్గంలో 160 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్ పనులు కొనసాగుతున్నాయని, నరసాపురంలో కొత్త సబ్‌స్టేషన్ నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా రైతులు, ఇతర రైతులకు లో-వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ వ్యవస్థ ఆధునికీకరణకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పాలకొల్లులో కొత్త సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో గత రెండేళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని రవికుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్, సబ్సిడీల కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.15 వేల కోట్లు భరిస్తోందన్నారు.
ఎకరానికి రూ.84 వేల వరకు ఆదా
సభకు అధ్యక్షత వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆక్వా రైతులకు విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
యూనిట్‌కు రూ.1.50 విద్యుత్ సబ్సిడీ వల్ల ఆక్వా రైతులకు ఎకరానికి సుమారు రూ.84 వేల వరకు ఆదా అవుతుందని చెప్పారు. ఈ సబ్సిడీ కోసం కూటమి ప్రభుత్వం సుమారు రూ.1,100 కోట్ల భారాన్ని భరిస్తోందన్నారు.
ఆక్వా రంగ అభివృద్ధితో పాటు రైతులకు ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని తెలిపారు.
ఆధునిక సాంకేతికత అవసరం
శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఆక్వా రంగానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కార్మికుల కొరత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
తక్కువ మంది కార్మికులతో ఎక్కువ ఉత్పాదకత సాధించేలా ఆధునిక యంత్రాలు, సాంకేతిక పద్ధతులను ఆక్వా రంగంలో ప్రవేశపెట్టాలని సూచించారు. రొయ్యలు, చేపల పెంపకం, చెరువుల నిర్వహణ, దిగుబడి సేకరణలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వేలాది రైతులకు ప్రయోజనం
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 57 ద్వారా జిల్లాలో సుమారు 13,000 మంది, అదనంగా మరో 3,500 మంది రైతులు విద్యుత్ సబ్సిడీ ప్రయోజనం పొందనున్నట్లు తెలిపారు.
ఆక్వా రైతులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ముందుండి పనిచేస్తుందని ఆమె చెప్పారు.
కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆక్వా రైతుల సంఘాల ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.