నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే వైఎస్సార్సీపీ, దాని అనుకూల మీడియా వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

అమరావతి: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే వైఎస్సార్సీపీ, దాని అనుకూల మీడియా వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పశుసంవర్ధక శాఖలో 160 వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునే పాత మెరిట్, వెయిటేజీ విధానంలో ఈ ఒక్కసారికి నియామకాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలను మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని ఆరోపించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుంటే తప్పుడు కథనాలతో అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
పశుసంవర్ధక శాఖలో సుమారు 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటిలో మొదటి విడతగా 160 వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపడుతుంటే దానిపై అనుమానాలు సృష్టించడం నిరుద్యోగుల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందని అన్నారు.
వెటర్నరీ డాక్టర్ల నియామకాలకు గతంలో అనుసరించిన విధానం కొత్తది కాదని మంత్రి తెలిపారు. 2016 అక్టోబర్ 28న జారీ చేసిన G.O.Ms.No.52 ప్రకారం 100 మార్కుల ఆధారంగా మెరిట్ నిర్ణయించే విధానం ఉందన్నారు.
ఈ విధానంలో BVSc మార్కులకు 60 మార్కులు, MVSc అర్హతకు 10 మార్కులు, ప్రభుత్వ లేదా ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ సేవలకు 10 మార్కులు, గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి సీనియారిటీకి సంవత్సరానికి నాలుగు మార్కుల చొప్పున గరిష్ఠంగా 20 మార్కులు కేటాయించే విధానం ఉందని వివరించారు.
వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్ల నియామకాల్లోనూ ఇదే తరహా వెయిటేజీ విధానం అమల్లో ఉందని మంత్రి పేర్కొన్నారు.
జాబ్ క్యాలెండర్లో భాగంగా వెటర్నరీ డాక్టర్ పోస్టులను తొలుత APPSC ద్వారా భర్తీ చేయాలని G.O.Ms.No.21 ద్వారా ప్రభుత్వం నిర్ణయించిందని అచ్చెన్నాయుడు తెలిపారు.
అయితే గత ఎనిమిదేళ్లుగా నియామకాలు జరగకపోవడంతో, అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని ప్రవేశపెడితే ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు నష్టపోతారని వెటర్నరీ నిరుద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరిందన్నారు.
ఈ ఒక్క నియామకానికి పాత మెరిట్, వెయిటేజీ విధానాన్ని కొనసాగించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారని, వారి అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలించిందని తెలిపారు.
అభ్యర్థుల విజ్ఞప్తి, నియామకాల స్వభావం తదితర అంశాలను పరిశీలించిన ప్రభుత్వం G.O.Ms.No.52 ప్రకారం పరీక్ష లేకుండా మెరిట్, వెయిటేజీ ఆధారంగా నియామకాలు చేపట్టేందుకు APPSCను కోరిందని మంత్రి వివరించారు.
అయితే ప్రస్తుత పని ఒత్తిడి, పరీక్ష లేకుండా వెయిటేజీ విధానంలో నియామకాలు నిర్వహించేందుకు అవసరమైన సమయం లేకపోవడంతో ఈ ప్రక్రియను చేపట్టలేమని APPSC తెలిపిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
దీంతో G.O.Ms.No.22 ద్వారా ఈ ఒక్కసారికి మాత్రమే పాత విధానంలో పశుసంవర్ధక శాఖ ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భవిష్యత్తులో వెటర్నరీ డాక్టర్ పోస్టుల నియామకాలను APPSC ద్వారా పరీక్షా విధానంలో నిర్వహిస్తామని స్పష్టం చేసినట్లు తెలిపారు.
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ విషయంలో ‘సాక్షి’ కథనంలో వాస్తవాలు లేవని మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం పేర్కొన్న అధికారి డైరెక్టర్గా లేరని, ఒక మహిళా అధికారి ఇన్చార్జి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు సంబంధిత అధికారుల వివరాలను కూడా సరిగా తెలుసుకోలేదని మంత్రి విమర్శించారు. నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను జీవోలోనే స్పష్టంగా పేర్కొన్నామని అన్నారు.
ఎనిమిదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు చివరిసారిగా పాత విధానంలో అవకాశం కల్పిస్తున్నామని, ఇకపై APPSC పరీక్షా విధానమే కొనసాగుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వ విధానమని, నియామక ప్రక్రియను అడ్డుకోవడం వైఎస్సార్సీపీ విధానమని మంత్రి విమర్శించారు.
యువత భవిష్యత్తును రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని సూచించిన అచ్చెన్నాయుడు, నియామకాలపై అనవసరమైన అనుమానాలు సృష్టించడం ద్వారా ఉద్యోగార్థులకు నష్టం కలిగించవద్దని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు కొనసాగిస్తుందని, ఎలాంటి రాజకీయ విమర్శలు వచ్చినా నియామక ప్రక్రియ నుంచి వెనక్కి తగ్గబోమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.