అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు రామ్‌దేవ్ బాబాతో కలిసి యోగా భ్యాసం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. యోగా ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధ్యమని పేర్కొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తో కలిసి యోగా గురువు బాబా రామదేవ్ యోగాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ చొరవతో యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని, ప్రస్తుతం 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ విశ్వగురువుగా మార్గనిర్దేశం చేసే స్థాయిలో ఉందని తెలిపారు.
సాంకేతికతతో పాటు ఆధ్యాత్మికతను సమన్వయం చేసుకుంటేనే భవిష్యత్ బలంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం ద్వారా ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, ఆనందమయ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించవచ్చన్నారు.
గత ఏడాది యోగాంధ్ర కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించి గిన్నిస్ మరియు ప్రపంచ రికార్డులు సాధించామని గుర్తుచేసిన సీఎం, వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తిరుపతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాల్లో కోటి మందికి పైగా యోగా సాధన చేస్తున్నారని తెలిపారు.
ఇంటింటికీ యోగాను తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన, స్వర్ణ గ్రామాలు, వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు.
యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రామాణిక యోగా ప్రోటోకాల్స్ రూపొందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రసాయన రహిత ఆహారాన్ని స్వీకరించాలని ప్రజలకు సూచించారు.
ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న సంజీవని ప్రాజెక్టులో యోగాను కూడా భాగం చేస్తామని తెలిపారు. రోజుకు ఒక గంట యోగా, ధ్యానం, ప్రాణాయామం చేస్తే ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
ది ఏపీ టాప్ న్యూస్ న్యూస్‌రూమ్ — ఆంధ్ర గళం.