వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

అమరావతి: వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి మొత్తం 33 మంది వియత్నాం పర్యటనకు వెళ్లారు. వీరిలో 19 మంది ప్రమాదం జరిగిన బోటులో ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, మిగిలిన వారిని రక్షించారు. ఒకరు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. విహార యాత్రకు వెళ్లి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన వారు అంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాద ఘటన, బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై సిఎం అధికారులతో మాట్లాడారు.
ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు రాష్ట్ర వాసుల కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన సహాయం చేయాలని సిఎం అధికారులను అదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు... వియత్నాం అధికారులతో, అక్కడ భారత ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.