వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ నిధులు విడుదల చేయడంపై ముంపు గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

మార్కాపురం జిల్లా: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పునరావాస, పునర్నిర్మాణ (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ నిధులు విడుదల చేయడంపై ముంపు గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న తమ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయం చేశారంటూ రైతులు, మహిళలు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి రైతులు, నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపుతున్నారు. సోమవారం సాయంత్రం ముంపు గ్రామమైన సుంకేసులలో టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... వెలిగొండ నిర్వాసితుల బాధలను అర్థం చేసుకుని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ జీవితాల్లో కొత్త ఆశలు నింపారని అన్నారు. 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారానికి మార్గం చూపిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు.
టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ... పోలవరం నిర్మాణానికి వేగం తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంతో పాటు నిర్వాసితులకు పరిహారం అందించి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. రైతులు, నిర్వాసితుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సీజన్‌కే వెలిగొండ జలాలను ప్రకాశం జిల్లా పొలాలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రాజెక్టు పూర్తితో వేలాది రైతు కుటుంబాలకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.