మద్దిపాటి వెంకట రాజు... పార్టీ కార్యకర్తలా ఆలోచించే నాయకుడు. కార్యకర్తలకు ఏం కావాలో గుర్తించి చేసే సేవకుడు. ఈ రెండు గుణాలే అతి తక్కువ కాలంలో మద్దిపాటిని పార్టీ అధినేతకు దగ్గర చేశాయి. అనంతరం ఎమ్మెల్యేని చేశాయి.

సర్వేలో టాప్ లో నిలిచిన గోపాలపురం ఎమ్మెల్యే
గెలిచింది మొదటిసారే... అయినా బలంగా జనంలోకి
కార్యకర్తలకు అందుబాటులో నిలుస్తూ... భరోసా కల్పిస్తూ
ప్రభుత్వ పథకాలనూ ప్రజలకు చేరువ చేయడంలో దూసుకుపోతున్న యువరాజు
అమరావతి: ఆ యువ ఎమ్మెల్యే మొదటి సారి శాసన సభలోకి అడుగు పెట్టారు. కొత్తగా గెలిచాడు కదా... కొత్త మురిపెంలాగే ఉంటుందని అనుకున్నారు అందరూ. అయితే ఎవరూ ఊహించని విధంగా దూసుకుపోతున్నాడు అందరికంటే ముందుగా. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూనే ఓ వైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ...మరో వైపు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో దూసుకెళ్తున్నారు. గెలిచింది మొదటి సారే అయినా అటు ప్రభుత్వాన్ని... ఇటు పార్టీని నియోజకవర్గంలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడంట ఆ రాజు గారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే అనుకుంటున్నారా...వివరాల్లోకి వెళ్తే.
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నుంచి ఎన్నికైన మద్దిపాటి వెంకటరాజు కొత్తగా గెలిచిన యువ ఎమ్మెల్యే. ఎన్నికల ముందు ఏడాది ముందు వరకూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల కమిటీకి ఇంఛార్జ్ గా వ్యవహరించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకుని ప్రోగ్రామ్స్ కమిటీ ఇంఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రతిపక్షంలో నాడు అధినేత చంద్రబాబు సూచనలు, సలహాలతో కార్యక్రమాలతో కేడర్ నుంచి లీడర్ వరకూ అందరినీ పరుగులు పెట్టించారు. టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలైన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, రా...కదలిరా వంటి కార్యక్రమాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు మద్దిపాటి వెంకటరాజు. అధినేత మనసు గెలిచిన ఆయన 2024 ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీ ఫారం అందుకుని తక్కువ కాలంలోనే నియోజకవర్గంలో పర్యటించి సీనియర్ నేత, హోంమంత్రి అయిన తానేటి వనితపై ఘన విజయం సాధించారు. ఆ గెలుపుతో ఆగకుండా... వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలి పోకూడదని నిర్ణయించుకున్నారంట మద్దిపాటి. నిత్యం జనాల్లో ఉంటూ, కార్యకర్తలతో అందుబాటులో ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా ఇట్టే వాలిపోతున్నారు. అంతేకాదు... ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలకు తన సొంత జేబులోంచే ఆర్ధిక సాయం కూడా అందిస్తున్నారంట. జిల్లాలోని ఎమ్మెల్యేలందరితో సఖ్యతగా ఉంటూ... నియోజకవర్గానికి కావాల్సిన నిధులు రాబట్టడంలోనూ మంత్రులతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించుకుంటున్నారంట. దీంతో నిత్యం నియోజకవర్గంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారట.
అభివృద్ధి టాప్... కార్యకర్తలతో నో గ్యాప్
ఎమ్మెల్యేల పనితీరుపై ఇటీవల కొన్ని సర్వే సంస్థలు అభిప్రాయాలను తీసుకుంటున్నాయి. ఈ సర్వేలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు టాప్ 4 గా నిలిచారు. ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం, ఎమ్మెల్యే పనితీరు, సమస్యలు పరిష్కరిస్తున్నారా వంటి ప్రశ్నలతో నియోజకవర్గంలో సర్వే చేయగా... ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుపై 70 శాతం సంతృప్తి వ్యక్తమైంది. వివాదాలకు దూరంగా ఉండటం, నియోజకవర్గ అభివృద్ధిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టడమే ప్రజల సంత్రుప్తికి కారణంగా నిలిచింది. అంతేకాదు... ప్రతిపక్షంలో అధినేత వద్ద పని చేసిన అనుభవంతో అధికారులు, పార్టీని ఎలా సమన్వయం చేసుకోవాలనేది వంటబట్టించుకున్నామో కానీ... ఎక్కడా వివాదాలకు తావులేకుండా సైలెంట్ గా చాపకింద నీరులా తన పని తాను చేసుకుని వెళ్తున్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈయన బలమైన నేతగా నియోజకవర్గంలో ఎదుగుతున్నారు. మంత్రిగా చేసిన తానేటి వనితను సునాయాసంగా ఓడించారు వెంకటరాజు. ఈ నేర్పుతనంతోనే కావచ్చు... నియోజకవర్గంలో తనకుంటూ ప్రత్యేకంగా మార్క్ చూపిస్తూ వెళ్తున్నారంట. అది ఎంతగా అంటే...వచ్చే ఎన్నికల్లో నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తాను అని తానేటి వనిత స్పష్టంగా చెప్పుకోలేనంతగా.