నెల్లూరు మేయర్ పోటీలో రూప్ కుమార్ యాదవ్, ఆనం విజయకుమార్ రెడ్డి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియా ప్రచారంపై ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ కోసం పోటీ హోరాహోరీగా ఉంది. కూటమి పార్టీల నుంచి తెలుగుదేశం మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు. మరోవైపు వైసీపీ నుంచి ఆనం కుటుంబ సభ్యుల్లో ఒకరైన ఆనం విజయ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం వీరి మధ్య పోటీ నెలకొని ఉంది. టీడీపీ అభ్యర్థిగా మేయర్ స్థానానికి నామినేషన్ వేయడానికి రూప్ కుమార్ యాదవ్ అనేక మందిని దాటుకుని చివరకు తన పేరును ఖరారు చేయించుకున్నారు. ఇటు వైపు చూస్తే వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కనీసం నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో కూడా సంప్రదించకుండా... ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేశారు. నిజానికి నెల్లూరు మేయర్ పదవి కచ్చితంగా కూటమి పార్టీయే ఎగరేసుకు పోతుందని అందరూ భావిస్తున్నారు. గతంలో డిప్యూటీ మేయర్ గా తనదైన శైలిలో పరిపాలన సాగించిన రూప్ కుమార్ కు నెల్లూరు నగర ప్రజల సమస్యల పట్ల మంచి అవగాహన ఉంది. నెల్లూరు నగర పరిధిలోని ఇటు టీడీపీ, అటు వైసీపీ నాయకులను అన్న, తమ్ముడు అని పేరు పెట్టి పిలిచే స్వాతంత్ర్యం ఉన్న వ్యక్తిగా రూప్ కుమార్ అందరికీ తెలుసు.
ఇక ఆనం విజయకుమార్ రెడ్డి విషయానికి వస్తే... నెల్లూరు పెద్దారెడ్లుగా రాష్ట్రం అంతా భావించే ఆనం కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తిగా తెలుసు. ఇంకా చెప్పాలి అంటే పార్టీ కార్యకర్తలను, నాయకులను, జిల్లాలో కీలక నేతలతో సంప్రదింపులు జరపకుండా ఆనం విజయకుమార్ పేరు ఎన్నికల ముందు ప్రకటించడంతో ఈయనకు ఇప్పటి వరకు రాని పబ్లిసిటీ వచ్చిందని చెప్పాలి. చాలా మందికి వైసీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన తరువాతే ఈయన ఎవరో తెలిసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈయకు ఉన్న క్యాడర్ సపోర్టు విషయానికి వస్తే... ప్రస్తుతం ఆనం విజయకుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ గా కూడా ఉన్నారు. ఇక్కడి నుంచే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ… గత ఎన్నికల్లో ఆయన పార్టీ మారి తెలుగుదేశం తరపున పోటీ చేసి గెలిచారు. అయితే వైసీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఆనం విజయకుమార్ రెడ్డికి వైసీపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. శ్రీధర్ రెడ్డి గెలుపుతో నియోజకవర్గంలో కేడర్ చేజారకుండా సమన్వయం చేసుకోవాలని సూచించింది. అయితే పార్టీ పెద్దలు విజయ కుమార్ కు ఇచ్చిన ముఖ్యమైన టాస్క్ ను ఆయన పక్కన పెట్టారు. అసలు పనిని వదిలేసి.... సొంత పనులు చేసుకోవడం ప్రారంభించారు. దీంతో స్ట్రాంగ్ క్యాడర్ ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గం క్యాడర్ ను రూరల్ ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విజయ్‌కుమార్‌రెడ్డి దూరం పెడుతూ వచ్చారు. దీంతో అక్కడ అసంతృప్తి బాగా పెరిగింది. దీనిపై జగన్ రెడ్డి కూడా మాజీ మంత్రి కాకాణి సమక్షంలో వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఆనం విజయకుమార్ రెడ్డికి వైసీపీ మద్దతు కూడా అంతంత మాత్రమే అని చెప్పాలి.
నెల్లూరు నగర మేయర్ పదవి కోసం పోటీ పడుతున్న రూప్ కుమార్ యాదవ్, ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఇద్దరి బలాలు, బలహీనతలు ఇద్దరికీ చాలా స్పష్టంగా తెలుసు. ఈ ఎన్నికల్లో రూప్ కుమార్ యాదవ్ కచ్చితంగా గెలుస్తాడు అనే నమ్మకం విజయ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులకు కూడా ఉంది. అయితే ఎలాగైనా రూప్ కుమార్ యాదవ్ గెలుపును అడ్డుకోవాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే డిజిటల్ వేదికగా రూప్ కుమార్ పై నెగటివ్ క్యాంపైన్ ఒకటి రన్ చేయాలని చూస్తుంది. ఈ క్యాంపైన్ రూప్ కుమార్ యాదవ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉంటుందని వైసీపీ లోని సన్నిహిత వర్గం ఇప్పటికే సమాచారం ఇచ్చింది. పెయిడ్ మీమ్స్ పేజ్ లతో రూప్ కుమార్ పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. ఈ పెయిడ్ క్యాంపైన్ కోసం నెల్లూరు వైసీపీ నేతలు ఇప్పటికే అడ్వాన్సులు కూడా ఇచ్చారని సమాచారం. ఈ క్యాంపైన్ ద్వారా ప్రజలకు రూప్ కుమార్ ను దూరం చేయాలనుకోవడంతో పాటు రూప్ కుమార్ ను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం కూడా జరగవచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు.