AP Local Body Elections: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కుటుంబానికి చెందిన నలుగురు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వేర్వేరు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడం అన్నమయ్య జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చిన్నమండెం మండలంలోని పడమటికోన ఎంపీటీసీ స్థానం నుంచి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తల్లి సుశీలమ్మ గురువారం నామినేషన్ దాఖలు చేయగా, ఆయన సతీమణి హరితమ్మ శుక్రవారం నామినేషన్ వేశారు.
ఇదే కుటుంబం నుంచి మంత్రి సోదరుడు లక్ష్మీప్రసాద్‌రెడ్డి తెదేపా తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు, మంత్రికి వరుసకు సోదరుడైన పి. దేవనాథరెడ్డి వైకాపా తరఫున జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేయడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎవరు బరిలో నిలుస్తారనే దానిపై నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పడమటికోన ఎంపీటీసీ స్థానంలో సుశీలమ్మ, హరితమ్మల్లో చివరకు ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వీరిలో ఎవరికి అభ్యర్థిత్వం ఖరారైనా, వారే చిన్నమండెం ఎంపీపీ అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీపై స్పష్టత రానుండటంతో స్థానిక రాజకీయ పరిణామాలపై అందరి దృష్టి నెలకొంది.
1 రోజుల క్రితం
