భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అక్టోబర్ 26న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు.

తిరుమల: భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శించుకున్న అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.
ఆలయం వద్ద టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. అర్చకులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఇస్తికఫాల్ స్వాగతం అందించారు.
అనంతరం ఉపరాష్ట్రపతి ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీ వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఉపరాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో, అదనపు ఈవో స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామివారిని కూడా ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, టీటీడీ బోర్డు సభ్యులు రామ్మూర్తి, దివాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.