స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఎన్నికల సంఘం తీరు, రీనామినేషన్లు, భద్రతా ఏర్పాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. అభ్యర్థులపై దాడులు, నామినేషన్ పత్రాల చింపివేత, స్క్రూటినీ పేరుతో అభ్యర్థిత్వాల తొలగింపు వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును పరిరక్షించాల్సిన వ్యవస్థలు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను గవర్నర్, రాష్ట్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు దృష్టికి ఆధారాలతో సహా తీసుకెళ్లినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారలేదని ఆరోపించారు. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల ఫిర్యాదులు, పత్రాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని జగన్ పేర్కొన్నారు. మైదుకూరులో అన్ని వార్డులకు అవకాశం కల్పించగా, తిరుపతి, కడప, రాజంపేటల్లో పరిమిత సంఖ్యలోనే రీనామినేషన్లకు అనుమతించారని విమర్శించారు. కడపలో మొత్తం 66 వార్డులుండగా, రాజంపేటలో 32 వార్డులున్నాయని గుర్తుచేస్తూ.. అన్ని వార్డుల్లోనూ పోటీకి సమాన అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
పుంగనూరు, రాయచోటి, పిడుగురాళ్ల, ఎర్రగుంట్ల, కమలాపురం, గురజాల, దాచేపల్లి, దర్శి, గుత్తి, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, బద్వేలు, తాడిపత్రి, కనిగిరి తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దశలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపించారు. మరికొన్ని ప్రాంతాల్లో స్క్రూటినీ సమయంలో అభ్యర్థిత్వాలు తొలగించారని తెలిపారు.
నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరించడం, ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు, నామినేషన్ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం వంటి చర్యలు చోటుచేసుకుంటున్నాయని జగన్ ఆరోపించారు. ఎన్నికల అధికారుల సమక్షంలోనే పత్రాలను చింపేయడం, దాడులకు గురైన వారిపైనే కేసులు నమోదు చేయడం, స్క్రూటినీ పేరుతో నామినేషన్లు తిరస్కరించడం, సంతకాలను ఫోర్జరీ చేసి ఉపసంహరణలుగా చూపడం వంటి ఘటనలపైనా విచారణ జరపాలని కోరారు.
నంద్యాల మున్సిపాలిటీలోని 51వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగమణి నామినేషన్ ఆమోదం పొందిన తర్వాత ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉపసంహరించుకున్నట్లు చూపించారని ఆరోపించారు. నగరిలోనూ చైర్మన్ అభ్యర్థి బాలకృష్ణ పేరును తుది జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. ఈ ఘటనలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ నామినేషన్ల ప్రక్రియపై అనేక సందేహాలు ఉన్నాయని జగన్ అన్నారు. తమ వివరాల ప్రకారం 659 మండలాల్లో 101 మండలాల్లో ఎంపీటీసీలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని, మరో 70 మండలాల్లో ఐదుకంటే తక్కువ నామినేషన్లు నమోదయ్యాయని తెలిపారు. ఎన్నికల సంఘం గణాంకాల్లో ఒక్కరోజులో నామినేషన్లు భారీగా పెరిగినట్లు చూపడంపై వివరణ ఇవ్వాలని కోరారు. కొన్ని మండలాల్లో నకిలీ నామినేషన్లు దాఖలయ్యాయని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు.
నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. ధర్మవరం, దాచేపల్లి, పుంగనూరు, కనిగిరి, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలను ప్రస్తావించారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు బాధితులకు అండగా నిలవాలని అన్నారు.
గోరంట్లలో ఎన్నికల అధికారి గదిలోనే నామినేషన్ పత్రాలను చింపేశారని, చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోనూ ఇలాంటి ఘటన జరిగిందని ఆరోపించారు. అభ్యర్థుల ఫిర్యాదులపై పోలీసులు, రిటర్నింగ్ అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.
నామినేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట కేంద్ర బలగాలను మోహరించాలని జగన్ డిమాండ్ చేశారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ భద్రతను పటిష్ఠం చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
తమ పార్టీ తరఫున న్యాయపోరాటం కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఇతర ఆధారాలను సేకరించి న్యాయస్థానాలకు సమర్పిస్తామని తెలిపారు. అభ్యర్థులకు పార్టీ న్యాయ విభాగం అండగా ఉంటుందని చెప్పారు.
ప్రతి అభ్యర్థికి నామినేషన్ వేసే అవకాశం, ప్రతి ఓటరుకు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించేలా వ్యవస్థలు పనిచేయాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.