రెండేళ్లలో శాంతిభద్రతలు, మహిళా రక్షణ, డ్రగ్స్ నియంత్రణలో గణనీయ పురోగతి ప్రజా భద్రత, సైబర్ రక్షణ, విపత్తు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ విశిష్ట పురోగతి సాంకేతికత, పారదర్శకత, జవాబుదారీతనంతో సమగ్ర సంస్కరణలు రాష్ట్ర హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల రక్షణ, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాల అరికట్టడం, విపత్తుల నిర్వహణ, జైళ్ల సంస్కరణలు, పోలీసు సంక్షేమం వంటి అన్ని రంగాల్లో సమగ్ర సంస్కరణలను చేపట్టి విశేష ఫలితాలు సాధించిందని రాష్ట్ర హోం వ్యవహారాలు మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రయోజనాలకు పరిమితమైన వ్యవస్థలను ప్రజా సేవా దృక్పథంతో పునర్నిర్మిస్తూ, ప్రజలకు జవాబుదారీగా పనిచేసే పరిపాలనా వ్యవస్థను ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ అనేది కేవలం అధికార ప్రదర్శన కాదని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే బాధ్యతగా ప్రభుత్వం విశ్వసిస్తోందని ఆమె తెలిపారు.
ప్రజల భాగస్వామ్యం, పోలీసు-ప్రజల సమన్వయం, సాంకేతికత వినియోగం, పారదర్శక పరిపాలన, వేగవంతమైన స్పందన, చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత సురక్షిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, నేరం జరగకుండా ముందుగానే నిరోధించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజల భద్రత, మహిళల గౌరవం, యువత భవిష్యత్తు, సమాజ శాంతి కోసం రాజీపడకుండా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అని మంత్రి స్పష్టం చేశారు.
నేర నియంత్రణలో గణనీయ పురోగతి – 14.1 శాతం క్రైమ్ రేట్ తగ్గింపు…
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి సాంకేతిక పరిజ్ఞానం, సమర్థవంతమైన నిఘా వ్యవస్థలు, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు, అంతర్‌శాఖ సమన్వయాన్ని మెరుగుపర్చడం ద్వారా రాష్ట్రంలో మొత్తం నేరాల శాతం సుమారు 14.1 శాతం మేర తగ్గిందని మంత్రి తెలిపారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణ, డిజిటల్ నిఘా వ్యవస్థల ద్వారా ఇన్విజిబుల్ పోలీసింగ్ ను అమలు చేస్తూ నేరాలను ముందుగానే గుర్తించి నిరోధించే దిశగా ప్రభుత్వం విజయవంతంగా ముందుకు అడుగులు వేసిందన్నారు. నేరస్థుల కదలికలను పర్యవేక్షించడం, ఆధారాలను వేగంగా సేకరించడం, విచారణలను వేగవంతం చేయడం ద్వారా శిక్షల శాతం పెరిగేలా చర్యలు చేపట్టబడుతున్నాయన్నారు.
మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం…
ఒక మహిళ అర్ధరాత్రి కూడా నిర్భయంగా వీధిలో నడవగలిగితేనే నిజమైన స్వాతంత్ర్యం సాధించినట్టే అనే భావనతో ప్రభుత్వం మహిళా భద్రతను అత్యంత ప్రాధాన్యతా అంశంగా తీసుకోవడం జరిగిందన్నారు. ఈ లక్ష్యంతో మహిళా రక్షణకు ప్రత్యేక విభాగాల ఏర్పాటు, ప్రతి జిల్లాలో ప్రత్యేక భద్రతా వ్యవస్థలు, సాంకేతిక ఆధారిత స్పందన యంత్రాంగం, శక్తి యాప్ ద్వారా అత్యవసర సహాయం మరియు మహిళలపై నేరాలకు ప్రత్యేక పర్యవేక్షణ అమలు చేయబడుతున్నదన్నారు. శక్తి యాప్ ద్వారా ఇప్పటివరకు 11.15 లక్షలకు పైగా అత్యవసర SOS కాల్స్ అందాయని, వాటిపై తక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.
ఆపరేషన్ ముస్కాన్ – వేలాది కుటుంబాల్లో మళ్లీ ఆనందం…
తప్పిపోయిన చిన్నారులు, మహిళలు, వృద్ధులను గుర్తించి కుటుంబాలకు చేర్చేందుకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ అత్యంతంగా విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 8,396 మంది తప్పిపోయిన వ్యక్తులను గుర్తించి, వారి కుటుంబాలకు తిరిగి చేర్చడం జరిగిందన్నారు. ఈ విజయాలు పోలీసు శాఖ మానవీయ కోణాన్ని ప్రతిబింబిస్తున్నదని మంత్రి తెలిపారు.
చిన్నారుల రక్షణలో రాజీలేని వైఖరి…
పోక్సో కేసులను ప్రభుత్వం అత్యంత సున్నితమైన అంశంగా పరిగణిస్తూ చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు, వేగవంతమైన ఫోరెన్సిక్ పరీక్షలు, ప్రత్యేక ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు బాధితులకు మానసిక, సామాజిక సహాయం అందించడం జరుగుచున్నదన్నారు. ఇప్పటివరకు 2,293 మంది చిన్నారులకు కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించబడ్డాయని తెలిపారు.
డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో చారిత్రాత్మక చర్యలు…
గతంలో రాష్ట్రాన్ని తీవ్రంగా కలవరపరిచిన గంజాయి, మాదకద్రవ్యాల సమస్యపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం వల్ల మంచి ఫలితాలు కనిపించాయని మంత్రి తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన EAGLE ద్వారా అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల నెట్వర్కులపై దాడులు, గంజాయి సాగు నిర్మూలన, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా రక్షించే అవగాహన చర్యలు చేపట్టబడ్డాయన్నారు. ఫలితంగా 56,674 గంజాయి కేసులు నమోదు, 2,366 మందిపై చట్టపరమైన చర్యలు చేపట్టడంతో పాటు ₹4 కోట్లకు పైగా విలువైన ఆస్తుల స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. జీరో గంజాయి సాగు లక్ష్యంతో సమగ్ర చర్యలు అమలులో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు.
సైబర్ నేరాలపై సాంకేతిక యుద్ధం…
డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. సైబర్ వార్ రూమ్స్ ఏర్పాటు, బ్యాంకులు, టెలికాం సంస్థలతో సమన్వయం, 1930 సైబర్ హెల్ప్‌లైన్, ఆన్లైన్ మోసాలపై రియల్ టైమ్ స్పందన వంటి చర్యల ఫలితంగా సుమారు ₹247 కోట్ల ప్రజల సొమ్మును మోసగాళ్ల బారిన పడకుండా రక్షించడం జరిగిందన్నారు. సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహించబడుతున్నాయన్నారు.
అత్యవసర సేవల్లో వేగవంతమైన స్పందన…
ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం వారి వద్దకు చేరుకోవాలనే లక్ష్యంతో స్పందన వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించడం జరిగిందన్నారు. 2024లో సగటున 30 నిమిషాలుగా ఉన్న స్పందన సమయం ప్రస్తుతం 10 నిమిషాల లోపుకు తగ్గిందని తెలిపారు. అత్యవసర సేవలలో 97.47 శాతం సమర్థవంతమైన స్పందన రేటు నమోదు కావడం విశేషం అన్నారు.
ఫోరెన్సిక్ రంగంలో సమగ్ర పునర్నిర్మాణం…
శాస్త్రీయ దర్యాప్తుకు వెన్నెముకైన ఫోరెన్సిక్ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోందన్నారు. జనవరి నుండి మే వరకు 7,793 కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ విశ్లేషణలు పూర్తి చేయబడ్డాయన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫోరెన్సిక్ ప్రయోగశాలలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
రోడ్డు భద్రత – ప్రాణనష్టాల తగ్గింపే లక్ష్యం…
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, సీసీటీవీ పర్యవేక్షణ, ట్రాఫిక్ అమలు బలోపేతం తదితర చర్యలు చేపట్టడంతో ప్రమాదాల తీవ్రత తగ్గుముఖం పట్టిందని మంత్రి తెలిపారు.
పోలీసు సంక్షేమంలో చారిత్రక నిర్ణయాలు…
పోలీసు సిబ్బంది సంక్షేమం లేకుండా సమర్థవంతమైన శాంతిభద్రతలు సాధ్యం కాదనే భావనతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. 6,000 మందికి పైగా పోలీసు నియామకాలు, 505 మంది గెజిటెడ్ అధికారులకు పదోన్నతులు, కానిస్టేబుల్ శిక్షణార్థుల స్టైపెండ్‌ను ₹4,000 నుండి ₹7,500కు పెంపు చేయడం జరిగిందన్నారు. ఇందు కోసం ₹7.5 కోట్ల అదనపు నిధుల కేటాయింపు చేయడం జరిగిందన్నారు.
జైళ్లను సంస్కరణ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం…
జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలు మాత్రమే కాకుండా పునరావాస కేంద్రాలుగా మారాలనే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి శిక్షణ, మానసిక ఆరోగ్య సేవలు, డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. ఖైదీలు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన మార్గదర్శకత్వం అందించబడుతోందన్నారు.
విపత్తు నిర్వహణలో దేశానికే ఆదర్శం…
గత రెండేళ్లలో విపత్తు నిర్వహణ వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించడం జరిగిందని మంత్రి తెలిపారు. 26 NDRF బృందాలు, 22 SDRF బృందాలు, డ్రోన్ ఆధారిత పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా ప్రాణనష్టం తగ్గించే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 872 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణలు నిర్వహించబడ్డాయన్నారు.
అగ్నిమాపక సేవలు – స్పందన నుంచి నివారణ దిశగా…
అగ్నిప్రమాదాల సమయంలో వేగవంతమైన స్పందనతో పాటు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అత్యాధునిక పరికరాలు, సాంకేతిక సదుపాయాలతో అగ్నిమాపక శాఖను బలోపేతం చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ – నేరస్థులకు కఠిన శిక్షలు…
నేరస్థులకు శిక్షలు ఖరారయ్యేలా ప్రాసిక్యూషన్ వ్యవస్థను బలోపేతం చేయడంతో 279 కీలక కేసుల్లో విజయవంతమైన తీర్పులు, 8 మందికి మరణదండన, 3 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, 42 మందికి 20 సంవత్సరాలకు పైగా శిక్ష, 14 మందికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడ్డాయని మంత్రి తెలిపారు.
అదనపు డిజి మదుసూధన రెడ్డి, హోం శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ కుమార విశ్వజిత్, ఎస్.పి.ఎఫ్. డిజి డా.త్రివిక్రమ వర్మ, హోం శాఖ స్పెషల్ సెక్రటరీ విజయకుమార్, ఈగల్ ఛీప్ ఐజి రవికృష్ణ, ఐజిలు శ్రీకాంత్, రాజకుమారి, విపత్తుల నిర్వహణ శాఖ ఎండి ప్రకర్ జైన్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వెంకట రమణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.