కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తుంటే జగన్ అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారని మంత్రి సవిత విమర్శించారు. కడపలో అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

అభివృద్ధికి కేరాఫ్ అడ్రాస్ కూటమి ప్రభుత్వమైతే... వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రాస్ జగన్, వైసీపీ అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో కార్యకర్తలు కాలరెగేసేలా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో విధ్వంస రచన జరిగిందన్నారు. కనీసం పులివెందుల సహా కడపలోనూ జగన్ చేసిందేమీ లేదని, తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు రావాలని జగన్ కు, వైసీపీ నాయకులకు మంత్రి సవిత సవాల్ విసిరారు. నగరంలోని బిల్డప్ సర్కిల్ వద్ద ఉన్న పుత్తా ఎస్టేట్ లో గురువారం నిర్వహించిన కుటమి ప్రభుత్వ రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడి సహకారంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ పరుగులు పెట్టిస్తున్నారన్నారు. రాజధాని అమరావతి, పోలవరం, రాష్ట్రంలో రహదారుల నిర్మాణం చేపడుతూ సంక్షేమాన్ని సైతం అమలు చేస్తున్నారన్నారు. తల్లికి వందనం, దీపం-2, స్త్రీ శక్తి పథకం, ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు ఏర్పాటు, పెన్షన్ల పెంపు ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
సుస్థిర పాలనతోనే అభివృద్ధి
సుస్థిర పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సవిత తెలిపారు. గుజరాత్ వరుసగా బీజేపీ ప్రభుత్వాలు రావడంతోనే ఆ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని, దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. కేంద్రంలోనూ ప్రధాని నరేంద్రమోడి నేతృత్వంలో వరుస విజయాలు సాధించడంతోనే దేశంలో అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఏపీలోనూ సుస్థిర పాలన ఉంటేనే అభివృద్ది సాధ్యమవుతుందని, ఇందుకు ప్రజలంతా కూటమి ప్రభుత్వం వెంటే నిలవాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో మరోసారి సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి ఉంటే, నేడు దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలిచి ఉండేదన్నారు. దురదృష్టవశాత్తు జగన్ అధికారంలోకి రావడంతో, రాష్ట్రంలో విధ్వంస పాలన సాగిందన్నారు. దీనివల్ల రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడిపోయిందని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు.
వెన్నుపోటుకు జగన్... అభివృద్ధికి కూటమి కేరాఫ్ అడ్రాస్
ఒక్క ఛాన్సంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారని ఇన్చార్జి మంత్రి సవిత మండిపడ్డారు. అమ్మఒడి పథకంలో పిల్లందరికీ రూ.15 వేలు ఇస్తామని చెప్పి, ఒకరితోనే సరిపెట్టారన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలంటూ ఆ వర్గాలకు తీరని అన్యాయం చేశారన్నారు. వెన్నుపోటుకు జగన్ కేరాఫ్ అడ్రాస్ మిగిలిపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కేరాఫ్ అడ్రాస్ గా నిలిచిందన్నారు. రాయలసీమకు నీళ్లిచ్చి, డ్రిప్ ఇరిగేషన్ ను ప్రోత్సహించిన ఘనత సీఎం చంద్రబాబునాయుడిదేనని అన్నారు.
కడప అభివృద్ధిపై చర్చకు రా... జగన్
రాయలసీమ బిడ్డనంటూ ఈ ప్రాంతానికి జగన్ తీవ్ర ద్రోహం చేశారని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత మండిపడ్డారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో పులివెందులోనూ, కడపలోనూ జగన్ చేసిసందేమీ లేదన్నారు. పులివెందులలో ఎంజేపీ గురుకుల పాఠశాలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.9 కోట్లు మంజూరు చేసి, అభివృద్ది చేస్తోందన్నారు. త్వరలోనే ఈ గురుకుల పాఠశాలను ప్రారంభించనున్నామన్నారు. మైదుకూరులో ఎంజేపీ గురుకుల పాఠశాలను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఈ గురుకుల పాఠశాలను కళాశాలగా అప్ గ్రేడ్ కూడా చేశామని, ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభించనున్నామని తెలిపారు. జగన్ మాదిరిగా మూడు పర్యాయాలు కొబ్బరి కాయలు కొట్టడంతోనే సరిపెట్టకుండా, జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్, సోలార్ ఎనర్జీ హబ్, పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేస్తున్నామన్నామని తెలిపారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులకు అధిక నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధిని, సంక్షేమాన్ని చేపట్టిందన్నారు. దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో అత్యధిక శాతం ఏపీకే తరలొస్తున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచామన్నారు. ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని, ఆరోజు ఆదివారమైతే ముందురోజే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. కూటమి పార్టీ కార్యకర్తలు గర్వ పడేలా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన కూటమి నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నసర్ కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొన్నాలన్నారు. వైసీపీ వేసే దొంగ ఓట్లను అడ్డుకోడానికి సర్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి సవిత దిశానిర్దేశం చేశారు. అనంతరం పలు డ్వాక్రా సంఘాలకు లింకేజీ రుణాలను జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ సచికేత్ విశ్వనాథ్, జేసీ నిధి మీనా,సబ్ కలెక్టర్ భావన, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, వరదరాజుల రెడ్డి, పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, మాధవీరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, డీసీసీబీ చైర్మన్ సూర్యానారాయణరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ముక్తియార్, రాంప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ సుబ్బిరామిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటసుబ్బారెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్, టీడీపీ జోనల్ ఇన్చార్జి శ్రీనివాసుల రెడ్డి, నియోజక వర్గ ఇన్చార్జి జగన్ మోహన్ రెడ్డి, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.