రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ
అన్నమయ్య జిల్లా: మదనపల్లెలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’, ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA)’ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆకట్టుకునేలా ప్రసంగించారు. "నన్ను కూడా ఆంధ్రప్రదేశ్ బిడ్డగా భావించి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నేనేం చేయాలో మార్గదర్శనం (గైడ్) చేయండి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. అనంత్ ప్రసంగానికి ముగ్ధులైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ... దేశంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) తరహాలోనే, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) అత్యున్నత స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాయలసీమ హార్టికల్చర్ హబ్ భారతదేశ సమగ్ర ప్రగతిలోనే కీలక పాత్ర పోషించనుందని, ఆంధ్రభూమి స్వర్ణభూమిగా మారబోతోందని పేర్కొన్నారు.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
రైతే సీఈఓ: ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఆధునిక నైపుణ్యాలు అందించి, ప్రతి అన్నదాతను తమ కమతాలకు సీఈఓలుగా తీర్చిదిద్దుతాం.
చారిత్రక ప్రాధాన్యం: గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం ‘జనగణమణ’ను బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించిన పవిత్ర నేల మదనపల్లె అని కొనియాడారు.
నాలుగు నినాదాల కలయిక: మహాత్మా గాంధీ ఆలోచనలైన ‘సర్వోదయ - అంత్యోదయ’ స్ఫూర్తితో పాటు, లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్ - జై కిసాన్’, అటల్ బిహారీ వాజ్పేయి ‘జై విజ్ఞాన్’, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘జై అనుసంధాన్’ నినాదాల కలయికతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పనిచేస్తుంది. ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని యువతరం నిజం చేసి చూపిస్తుంది.
రైతు సంక్షేమానికి అధునాతన సాంకేతికత: పంటలకు చీడపీడల బెడద లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డ్రోన్లు, రోబోటిక్స్ సాంకేతికతతో ‘ప్రెసిషన్ ఫార్మింగ్’ విధానాన్ని అమలు చేసేందుకు ISA సహకరిస్తుంది. నీరు, ఎరువుల సమర్థ నిర్వహణలో రైతులను సాంకేతికతతో అనుసంధానిస్తాం. ముఖ్యంగా మదనపల్లె టమోటా రైతులకు ఉత్పత్తులను ఎప్పుడు, ఎక్కడ విక్రయిస్తే గరిష్ట లాభం వస్తుందో మార్గదర్శనం చేస్తాం.
జియో & ఐఎస్ఏ భాగస్వామ్యం: రైతుల ఇంటి ముంగిటకే సేవలను అందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ తో జియో కలిసి పనిచేస్తుంది. ‘జియో కృషి’ ద్వారా కర్షకులకు పూర్తిస్థాయి సాంకేతిక సహకారాన్ని అందిస్తాం.
అన్నదాతలే ఊర్జాదాతలు: రిలయన్స్ గ్రీన్ బిజినెస్ ద్వారా అన్నదాతలను ఇంధన ప్రదాతలు (ఊర్జాదాతలు)గా మారుస్తాం. ఇందులో భాగంగా రిలయన్స్ సంస్థ కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్ల ఏర్పాటుకు రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతోంది. స్వచ్ఛమైన ఇంధనం, ఆరోగ్యకరమైన పశుసంపదే మా లక్ష్యం. జామ్నగర్లో బయో ఎనర్జీ అభివృద్ధికి ప్రత్యేక ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం.
పశు సేవా హి ప్రభు సేవా: 'దేశ్ సేవా - కిసాన్ సేవా' మా ప్రధాన నినాదం. 'పశు సేవా హి ప్రభు సేవా' అని ప్రగాఢంగా విశ్వసిస్తూ 'వంతార' ద్వారా మూగజీవాలకు సేవలు అందిస్తున్నాం. పశుధన్ హైటెక్ యానిమల్ హస్బెండ్రీ ఏర్పాటు ద్వారా పల్లెల్లో పశుసంపదను పెంపొందించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అద్భుతంగా అమలవుతోంది. రూ. 14 లక్షల కోట్ల విలువైన 388 మెగా ఇన్వెస్ట్మెంట్లు, 11 లక్షల ఉద్యోగాల సృష్టి దిశగా రాష్ట్రం వేగంగా దూసుకుపోతోంది. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ పూర్తి సహకారాన్ని అందిస్తుంది.
సుస్థిర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ వాణిజ్య పటిష్టతకు ఈ ప్రాజెక్టు ద్వారా బలమైన పునాది పడిందని అనంత్ అంబానీ పేర్కొన్నారు.