సోమవారం ఢిల్లీలో జరగనున్న జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. "సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం" అనే అంశాలపై పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికే వేదికగా సోమవారం ఢిల్లీలో జరగనున్న జనసేన విస్తృత స్థాయి సమావేశం మారనుంది. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశం కేవలం పార్టీ అంతర్గత కార్యక్రమం కాకుండా, జనసేన భవిష్యత్ రాజకీయ దిశను సూచించే కీలక ఘట్టంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
"సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం" అనే అంశంతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో జనసేన భావజాలం, జాతీయ సమగ్రతపై పార్టీ వైఖరి, దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ స్థాపనకు పన్నెండు సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో జాతీయవాదాన్ని కేంద్రంగా చేసుకుని దేశ రాజధానిలో సమావేశం నిర్వహించడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశానికి జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, తెలంగాణ నేతలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీలో చేరిన సభ్యులను ఆహ్వానించడం గమనార్హం. ఇది పార్టీ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించే ఆలోచనలో ఉందనే సంకేతాలను ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీలోని అశోక హోటల్లో జరగనున్న ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలపై స్పష్టమైన కార్యాచరణ, భవిష్యత్ వ్యూహాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే జాతీయ సమగ్రతకు కట్టుబడి ఉండే రాజకీయ శక్తిగా జనసేనను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ సమావేశం జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జనసేన జాతీయ రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించబోతుందా అనే చర్చకు ఈ సమావేశం కేంద్ర బిందువుగా మారింది.