తిరుపతిలో నిర్వహించిన కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ప్రసంగించిన లోకేష్.. గత రెండేళ్లలో జేసీబీ రాజకీయాలు, దాడులు, హత్యలు, బూతు సంస్కృతి వంటి ఘటనలు జరగలేదని వ్యాఖ్యానించారు.

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ప్రసంగించిన లోకేష్.. గత రెండేళ్లలో జేసీబీ రాజకీయాలు, దాడులు, హత్యలు, బూతు సంస్కృతి వంటి ఘటనలు జరగలేదని వ్యాఖ్యానించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి విషయంలో గత ప్రభుత్వాన్ని తాను హెచ్చరించానని లోకేష్ తెలిపారు. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. రాయలసీమపై ఎన్టీఆర్కు ఎంతో ప్రేమ ఉండేదని, కరువు సమయంలో జోలె పట్టుకుని ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేశారు. మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు.
రాయలసీమను "రాయల్సీమ"గా మార్చే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని లోకేష్ పేర్కొన్నారు. రాయలసీమలో అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమలు పెరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన నాయకుడు చంద్రబాబేనని కొనియాడారు.
గత వైసీపీ ప్రభుత్వ పాలనను "గొడ్డలి పార్టీ అరాచక పాలన"గా అభివర్ణించిన లోకేష్, ఆ సమయంలో ఎన్నో దారుణాలు జరిగాయని ఆరోపించారు. ఒక్క మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడిని హత్య చేశారని, డ్రైవర్ సుబ్రమణ్యంను చంపేసి డోర్ డెలివరీ చేసిన ఘటనలు కూడా రాష్ట్రం చూసిందని విమర్శించారు. టీడీపీ జెండా లేకుండా చేస్తామని అప్పట్లో వైసీపీ నాయకులు చెప్పారని, కానీ ఇప్పుడు ప్రజలే వైసీపీ జెండాలను పీకేశారని లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పటికే తమ తీర్పు ఇచ్చారని అన్నారు. రప్పరప్ప అంటే వైసీపీ అరాచకాలను చూస్తూ ఊరుకోమని, "రెడ్ బుక్" తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుందని హెచ్చరించారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. తమ ప్రభుత్వాన్ని గూగుల్, ఫైటర్ జెట్, కియా, క్రెడిబులిటీకి ప్రతీకగా పేర్కొంటూ, ప్రత్యర్థి పార్టీని గొడ్డలి, ఫ్యాక్షన్, కిడ్నాప్, క్రిమినాలిటీతో పోల్చారు.
వైసీపీ అధినేత జగన్పై కూడా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పేరులోని "జీ"ని కొందరు జెన్జీగా భావిస్తున్నారని, కానీ అది గొడ్డలిని సూచిస్తుందని ఎద్దేవా చేశారు. జగన్కు "సీసీడీ" అంటే "క్రెడిట్ చోరీ డిజార్డర్" ఉందని విమర్శించారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తే వాటిని కూడా తానే తీసుకొచ్చినట్లు చెప్పుకుంటారని ఆరోపించారు.