పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఆహార భద్రతా విభాగం అధికారులు కొరడా ఝళిపించారు.

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఆహార భద్రతా విభాగం అధికారులు కొరడా ఝళిపించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న పలు తినుబండారాల కేంద్రాలపై కొరడా విదిలించారు. ఆహార భద్రత డైరెక్టర్ పి.అరుణ్‌బాబు నేతృత్వంలో బుధవారం పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. హోటళ్లలో వంటశాలల పరిశుభ్రత, తయారీ విధానాలు, వంట నూనెల స్వచ్ఛతతో పాటు ప్రభుత్వ అనుమతి పత్రాలను క్షుణ్నంగా పరిశీలించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ నడుపుతున్న పలు దుకాణాలపై కేసులు నమోదు చేయడంతో పాటు అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లను మూసివేయించారు. తనిఖీల్లో భాగంగా లేబుల్ లేని 44 కిలోల పదార్థాలను సీజ్ చేయగా, ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మరో 20 కిలోల ఆహారాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
ఆర్కే రెస్టారెంట్లో అపరిశుభ్రత.. నమూనాల సేకరణ
స్థానిక ఆర్కే రెస్టారెంట్లో తనిఖీలు చేపట్టిన బృందం.. వంటశాల అత్యంత అధ్వానంగా, అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించింది. దీంతో తక్షణమే కిచెన్‌ను మూసివేయాలని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లేబుల్ వివరాలు లేకుండా నిల్వ ఉంచిన 44 కిలోల ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని యజమాన్యంపై కేసు నమోదు చేశారు. నాణ్యతా ప్రమాణాల పరిశీలన కోసం అక్కడున్న శనగపప్పు, కందిపప్పు నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపారు.
నిల్వ ఆహారం.. వాడిన నూనెలే మళ్లీ మళ్లీ..
జూపల్లి స్పైసెస్ హోటల్‌ను పరిశీలించిన అధికారులు.. ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను బయటకు తీయించి పూర్తిగా ధ్వంసం చేశారు. వంటల్లో పదేపదే మరిగించిన నూనెలను వాడుతున్నట్లు గుర్తించారు. పరీక్షించగా నూనె రీడింగ్ 33గా నమోదు కావడంతో రెస్టారెంట్‌పై కేసు నమోదు చేశారు. ఇక్కడి నుంచి మూడు రకాల ఆహార నమూనాలను ల్యాబ్‌కు తరలించారు. ఇక వినుకొండ రోడ్డులోని ‘యునిక్యూ’ హోటల్ కనీస అనుమతులు లేకుండానే అక్రమంగా వ్యాపారం సాగిస్తున్నట్లు తేలడంతో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు గాలికొదిలేసిన నిర్వాహకులపై కేసు నమోదు చేయడంతో పాటు అక్కడి కిచెన్‌ను మూసివేయించారు. ఫ్రిజ్‌లో నిల్వ చేసిన 20 కిలోల పాడైపోయిన ఆహారాన్ని స్వాధీనం చేసుకుని పారబోయించారు.
నాణ్యత లేకుంటే కఠిన చర్యలు
పట్టణంలోని ఏకే బిర్యానీ పాయింట్లో వంటశాల నిర్వహణ సరిగా లేకపోవడం, నూనె రీడింగ్ 26.5గా ఉండటంతో లోపాలను సరిదిద్దుకోవాలని నోటీసులు అందించారు. షాజ్ బిర్యానీ పాయింట్ వంటశాల పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా దర్శనమివ్వడంతో దాన్ని అధికారులు మూసివేయించారు. ఇక్కడి బిర్యానీ శాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు. పల్నాడు బస్టాండ్ రోడ్డులోని హెచ్6 రెస్టారెంట్లో తనిఖీలు చేపట్టగా, నూనె రీడింగ్ ఏకంగా 33.5గా తేలడంతో నిర్వాహకులపై కేసు నమోదు చేసి తగిన చర్యల నిమిత్తం నోటీసు జారీ చేశారు.
ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆహార భద్రత డైరెక్టర్ హెచ్చరించారు. ఈ దాడుల్లో సంయుక్త నియంత్రణాధికారి బి.శ్రీనివాస్, గుంటూరు జిల్లా సహాయ నియంత్రణాధికారి ఎన్.పూర్ణచంద్రరావుతో పాటు ఆహార తనిఖీ అధికారులు సుబ్బారావు, వెంకటేశ్వర్లు, నర్సింహుడు పాల్గొన్నారు.