అమెరికా – ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుభవార్త చెప్పాడు. గత కొంత కాలంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు చెక్ పెడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన అమెరికా – ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ పేర్కొన్నారు. కుదిరిన శాంతి ఒప్పందంతో ఇరాన్ పై ఇప్పటికే ఉన్న నావికా దిగ్బంధనం ముగుస్తుందని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఇకపై ఎలాంటి సుంకాలు లేకుండా హార్మూజ్ జలసంధి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
“ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నౌకలు అన్నీ ఇంజన్లను స్టార్ట్ చేయండి. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా అకౌంట్ లో పిలుపునిచ్చారు. అలానే ఈ శాంతి ఒప్పందానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు శాంతి ఒప్పందానికి సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు వెల్లడి కాలేదు. కేవలం ట్రంప్ చేసిన ప్రకటన తప్ప అధికారిక వర్గాల్లో ఎలాంటి ఊసు దీనిపై వినిపించడం లేదు. శాంతి ఒప్పందం కుదిరితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విధంగానే ఇరాన్ కూడా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇరాన్ నుంచి లాంటి సడీ చప్పుడు లేదు. అయితే ఈ శాంతి ఒప్పందంకు సంబంధించి పాక్ అధ్యక్షుడు షెనబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. శాంతి ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. అమెరికా- ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందంపై త్వరలోనే సంతకాలు చేయనున్నట్లు షరీఫ్ ప్రకటించారు.