అనకాపల్లి జిల్లాలో పోలీసులు రూ.5.5 కోట్ల విలువైన 43 లీటర్ల హాషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేసి రెండు వాహనాలను సీజ్ చేశారు.

అనకాపల్లి: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అనకాపల్లి జిల్లా పోలీసులు చేపట్టిన ప్రత్యేక నిఘాలో భారీగా హాషిష్ ఆయిల్ పట్టుబడింది. ఒడిశా నుంచి కేరళకు తరలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్న 43 లీటర్ల హాషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.5.50 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ రవాణాకు ఉపయోగించిన ప్యాసింజర్ ఆటో, మోటార్ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, IPS ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా వి.మాడుగుల ఎస్ఐ జి.నారాయణరావు ఆధ్వర్యంలోని పోలీసు బృందం వి.మాడుగుల మండలంలోని ఎం.కోడూరు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టింది.
పాడేరు ఘాట్ రోడ్డు వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ ఆటో AP39 X 3211, మోటార్ సైకిల్ OD30H 5130లను పోలీసులు ఆపి తనిఖీ చేశారు.
వాహనాల్లో దాచిన 43 ప్యాకెట్ల హాషిష్ ఆయిల్ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్ సుమారు ఒక లీటర్ చొప్పున మొత్తం 43 లీటర్ల హాషిష్ ఆయిల్ ఉన్నట్లు వెల్లడించారు.
డ్రగ్స్‌తో పాటు రవాణాకు ఉపయోగించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ ముఠా ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పరిధిలోని మాలిగూడ, దాబుగూడ ప్రాంతాల నుంచి హాషిష్ ఆయిల్‌ను సేకరించి, పాడేరు ఘాట్ రోడ్డు మీదుగా అనకాపల్లి, ఆ తర్వాత కేరళలోని పాలక్కాడ్‌కు తరలించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
పోలీసుల ప్రకారం, నిందితుల్లో ఒకరైన అరుణ్ కుమార్ ఒడిశాలో రవాణా ఏర్పాట్లు చేసి, ఇతర నిందితులకు నగదు అందించి ముందుగానే కేరళకు వెళ్లిపోయాడు.
అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
A6 అరుణ్ కుమార్, పాలక్కాడ్, కేరళ, ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
రూ.కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్న వి.మాడుగుల ఎస్ఐ జి.నారాయణరావు, ఐదుగురు సిబ్బందితో కూడిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు.
విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలతో పాటు ప్రత్యేక నగదు రివార్డులు అందజేశారు.
జిల్లా పోలీసుల గణాంకాల ప్రకారం, 2026 సెప్టెంబర్ 27 నాటికి అనకాపల్లి జిల్లాలో 72 మాదకద్రవ్యాల కేసులు నమోదు కాగా, 199 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ కేసుల్లో 80 వాహనాలను స్వాధీనం చేసుకుని 2,856.573 కేజీల గంజాయి, 26.06 కేజీల హాషిష్ ఆయిల్ సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆగస్టు నెలలో ఐదు కేసులు నమోదు చేసి 76.48 కేజీల గంజాయి, 14.7 కేజీల హాషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని 14 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
సెప్టెంబర్‌లో ఇప్పటివరకు నాలుగు కేసుల్లో 614.5 కేజీల గంజాయి, 2.22 కేజీల హాషిష్ ఆయిల్, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసుల్లో ఆర్థిక మూలాలపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు తెలిపారు.
NDPS కేసుల్లో గుర్తించిన 22 మందికి సంబంధించి రూ.1,11,41,100 విలువైన ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
అలాగే PIT NDPS చట్టం కింద 42 మందిని గుర్తించి 13 ఉత్తర్వులను అమలు చేసినట్లు తెలిపారు.
కోర్టు విచారణల్లో 21 కేసుల్లో 33 మందికి శిక్షలు ఖరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో 16 మందికి ఐదేళ్లలోపు, మరో 17 మందికి 10 నుంచి 15 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ యువత భవిష్యత్తును దెబ్బతీసే మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసుల పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
అనకాపల్లి జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని చెప్పారు.
అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్ట్ వంటి చట్టాలను కూడా వినియోగిస్తామని హెచ్చరించారు.
మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఈ. శ్రీనివాసులు, కె.కోటపాడు సీఐ కృష్ణతో పాటు పలువురు సీఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
15 September 2026
