Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టు, జల జీవన్ మిషన్-అమరజీవి జలధార పనులకు నిధులు సకాలంలో విడుదల చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం చంద్రబాబు కోరారు.

Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టు పనులు, జల జీవన్ మిషన్-అమరజీవి జలధార పథకం పనులకు నిధులు సకాలంలో విడుదల చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర మంత్రితో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న తాగునీటి, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని వివరించారు.
పుష్కరాల నాటికి పోలవరం పూర్తి లక్ష్యం
గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పునరావాస పునరావాస పరిహారం (ఆర్అండ్ఆర్) పనులకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
పోలవరం వద్ద 41.15 మీటర్ల కాంటూర్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన ఆర్అండ్ఆర్ పనులను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. 45.72 మీటర్ల కాంటూర్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన చర్యలు, పనులపైనా కేంద్ర మంత్రితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూడాలని కోరారు.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో సమస్యలు పరిష్కరించాలి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు కోరారు. రక్షణ కరకట్టల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రజాభిప్రాయ సేకరణల కారణంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ జారీ చేసిన స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆ ఉత్తర్వు అమలులో లేకపోయినా, పూర్తిగా ఉపసంహరించాలని కోరారు.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో కేంద్రం సమన్వయం చేసుకుని ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. పరస్పర సహకారం, సమన్వయం, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మూడు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా సమస్యను సామరస్యంగా పరిష్కరించవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.
గోదావరి జలాలను సద్వినియోగం చేయాలి
గోదావరి వరద జలాల్లో వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ద్వారా ఆ నీటిని మళ్లించి వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలవరాన్ని ప్రధాన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
27 లక్షల గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు
ప్రొద్దుటూరులో ఇటీవల ప్రారంభించిన జల జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలను కూడా కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 95 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉండగా, ఇప్పటికే 62 లక్షల కుటుంబాలకు కుళాయి ద్వారా తాగునీటి సౌకర్యం అందుతోందన్నారు.
మరో 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కుళాయి కనెక్షన్లు కల్పించే పనులకు ఇటీవల శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, పనుల పురోగతికి అనుగుణంగా కేంద్ర నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు.
దక్షిణాది రాష్ట్రాల్లో నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.