కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ నియామకాల్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ అక్రమాలు, లీకులు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ నియామకాల్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ అక్రమాలు, లీకులు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ విషయంలో వెలుగులోకి వస్తున్న విషయాలు చూస్తుంటే చాలా షాక్ కలిగిస్తున్నాయని, లక్షల మంది నిరుద్యోగ యువత నమ్మకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దారుణంగా వమ్ము చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధానికి, మోసానికి, దగాకి ఒక షర్టు ప్యాంటు తొడిగితే ఆయనే చంద్రబాబు అంటూ ఘాటుగా విమర్శించారు.
మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో గోల్మాల్ వ్యవహార నడిపిందని వైయస్ జగన్ మండిపడ్డారు. పోటీ పరీక్షల ఫలితాలు పారదర్శకంగా ఉండాలి కానీ, ఈ డీఎస్సీలో మెరిట్ లిస్టులు, మార్కులు, ర్యాంకులు, కటాఫ్ వివరాలను పబ్లిక్ డిస్ప్లేలో పెట్టకుండా అంతా గోప్యంగా ఉంచారని విమర్శించారు. నియామక ప్రక్రియను పూర్తిగా సెంట్రలైజ్ చేసి, కేవలం సెలెక్ట్ అయిన అభ్యర్థులకే మెసేజ్‌లు పంపే కొత్త పద్ధతి తెచ్చారని ఆరోపించారు. రోస్టర్, రిజర్వేషన్లు అన్నీ చూసి 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా సక్రమంగా పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రిజెక్ట్ లిస్టులో పెట్టడం దారుణమన్నారు. అర్హులైన అభ్యర్థుల డేటాను వెబ్సైట్ నుంచి మాయం చేశారని, దీని వెనుక పెద్ద దగా దాగి ఉందని పేర్కొన్నారు.
అత్యంత రహస్యంగా జరగాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, డిజిటల్ అప్లోడ్ ప్రక్రియను కావాలనే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారని వైయస్ జగన్ ఆరోపించారు. అలా పనిచేసిన ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్‌లో ఫస్ట్ ర్యాంక్, టీజీటీ తెలుగు పరీక్షలో జోన్-2లో 6వ ర్యాంక్ రావడం లీకేజీకి ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. తప్పు జరగకపోతే ఆ అభ్యర్థి వివరాలను ఎందుకు మాయం చేశారు? సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాలేదనే సాకుతో అతనికి ఉద్యోగం ఎందుకు నిరాకరించారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎవరైనా వెరిఫికేషన్‌కు రాకుండా ఉంటారా అని నిలదీస్తూ, ఆ అభ్యర్థి అందుకే కోర్టును ఆశ్రయించాడన్నారు. రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఆయనే లాయరు కావడంతో పాటు విద్యాశాఖ మంత్రిగా ఆయన కొడుకే (లోకేష్) ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విచారణపై నమ్మకం లేదని, అందుకే దీనిపై సీబీఐ దర్యాప్తు జరగాలని పట్టుబట్టారు.
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అనేది మరో పెద్ద స్కామ్‌గా మారిందని జగన్ విమర్శించారు. జీవో నంబర్ 4, 47ల ద్వారా క్రీడాకారులకు గతంలో ఉన్న రాత పరీక్ష నిబంధనను పూర్తిగా మార్చేసి, కనీసం డీఎస్సీ పరీక్ష రాయకుండానే కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేలా బ్యాక్ డోర్ పాలసీ తెచ్చారని ఆరోపించారు. ఒక్కో పోస్టును రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు అమ్ముకుంటున్న ఆడియో, వీడియో ఆధారాలు బయటపడినా, పోలీసులు తూతూమంత్రంగా కేసు పెట్టి స్టేషన్ బెయిల్‌పై వదిలేశారని ధ్వజమెత్తారు. ఈ కోటా కింద పతకాలు, ట్రోఫీలు లేకపోయినా కేవలం ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఉన్న 270 మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. జూడో, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్లలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, లోకేష్ తోడల్లుడు ఎంపీ భరత్ కీలక పదవుల్లో ఉన్నారని, వీరే సర్టిఫికెట్లు ఇచ్చి వీరే ధృవీకరించుకున్నారని ఆరోపించారు. తీరా తమకు కావాల్సిన వారితో పోస్టులు నింపేసాక జీవో నంబర్ 25, 56ల ద్వారా ఆ గేట్లను మూసేశారని ఎద్దేవా చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే, ఒకే నోటిఫికేషన్‌తో ఎలాంటి తప్పులు, లీకులకు తావులేకుండా కేవలం 4 నెలల్లోనే 1.30 లక్షల గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని జగన్ గుర్తుచేశారు. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 5 తొలి సంతకాలంటూ హంగామా చేశారని, అందులో మెగా డీఎస్సీ కూడా ఒకటని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల నోటిఫికేషన్‌ను రద్దు చేసి, కాలయాపన చేసి, వాటిని కూడా కలుపుకుని 16 వేల పోస్టులకే 'మెగా' అని పేరు పెట్టి డబ్బా కొట్టుకుంటున్నారని, తీరా చూస్తే ఆ ప్రక్రియను స్కామ్‌ల కంపుగా మార్చారని దుయ్యబట్టారు.
చంద్రబాబు నాయుడు పాలన అంతా లీకేజీల మయమని, 1995 నుండి నేటి డీఎస్సీ వరకు లీకుల్లో ఆయనకు పెద్ద రికార్డే ఉందన్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తే బీపీ తెచ్చుకుని కేసులు పెడుతున్నారని, ఇది జెన్-జెడ్ (Gen-Z) కాలమని, దగాపడ్డ యువత తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. డీఎస్సీ అభ్యర్థులకు అండగా న్యాయపోరాటం చేస్తామని, భవిష్యత్తులో తాము అధికారంలోకి రాగానే కమిషన్ వేసి రీ-వెరిఫికేషన్ ద్వారా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు రెండేళ్ల వెన్నుపోటు, దగా పాలనకు నిరసనగా.. అలాగే డీఎస్సీ బాధితులకు సంఘీభావంగా రేపు (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల్ని, మహిళల్ని, యువతను కలుపుకుని భారీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.