2026 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు మేయర్ రేసు వేడెక్కుతోంది. రూప్ కుమార్ యాదవ్‌తో పాటు పలువురి పేర్లు వినిపిస్తుండగా, మేయర్ రిజర్వేషన్ కీలక అంశంగా మారింది.

నెల్లూరు నగర మేయర్ పదవి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వ్యక్తుల్లో రూప్ కుమార్ యాదవ్ ఒకరు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రూప్ కుమార్ యాదవ్ సాధారణ ఎన్నికల ముందు జరిగిన రాజకీయ సమీకరణలు భాగంగా వేమిరెడ్డి దంపతులతో పాటు తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టారు. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ గా ఇప్పటి వరకు సేవలు అందించిన రూప్ కుమార్ నగర మేయర్ పీఠాన్ని అధిరోహించాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నా సరే... ఈసారి నెల్లూరు నగర మేయర్ పీఠంపై రూమ్ కుమార్ యాదవ్ కూర్చోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఇందుకు భిన్నంగా పరిస్థితులు మారుతున్నాయని నెల్లూరు రాజకీయ విశ్లేషణకుల వాదన.
రూప్ కుమార్ యాదవ్ కు అడ్డుగా నిలుస్తోంది ఎవరు?
నెల్లూరు నగర పీఠం పై రూప్ కుమార్ యాదవ్ కు ఉన్న ఆసక్తే... నెల్లూరు జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులకు సంబంధించిన రాజకీయ వారసులకు, అనుచరులకు ఉంది అనేది ఓపెన్ సీక్రెట్. అంతలా మేయర్ పదవి కావాలని కోరుకుంటున్న వ్యక్తులు ఎవరో ఓ లుక్కేద్దాం. రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం... మంత్రి నారాయణకు ప్రధాన అనుచరుడిగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి మేయర్ పదవి కోసం తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నారని సమాచారం. ఇదే మంచి అవకాశం, ఈ అవకాశం పోతే తన జీవితంలో రాజకీయంగా మరే పదవి తనకు దక్కదు అని భావనలో ఉన్నారు. ఇందుకు మంత్రి నారాయణ నుంచి అనేక సార్లు తన పేరును అధిష్టానం దృష్టిలో పెట్టాలని ఒత్తిడి తెస్తున్న మాట వాస్తవమే అని చెప్తున్నారు. మంత్రి నారాయణ ఎదుగుదలలో కచ్చితంగా తన పాత్ర ఉందని విజయ భాస్కర్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. అందుకే నారాయణ తనకు మద్దతు తెలుపుతారనే ఆశ కూడా ఉంది. ఇదిలా ఉంటే మంత్రి నారాయణ కుమార్తె రూపంలో కూడా రూప్ కుమార్ యాదవ్ కు మరో అడ్డంకి ఉంది. ఇటీవల నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ... తన కూతురు షరణీ మేయర్ రేసులో లేదని తేల్చి చెప్తారు. అయితే ఇది కేవలం నోటి నుంచి వచ్చిన మాటే తప్ప... మనసు నుంచి వచ్చిన మాట కచ్చితంగా కాదని నారాయణ సన్నిహితుల వాదన. షరిణీ ని మేయర్ పీఠం మీద చూస్తే నెల్లూరు నగరం ఎప్పటికీ తన కంట్రోల్ లోనే ఉంటుందని భావన. ఇలాంటి నేపథ్యంలో విజయభాస్కర్ రెడ్డి కంటే కూడా కన్న కూతురు షరణినీ మేయర్ చేయడానికే నారాయణ ఎక్కువ విలువ ఇస్తారు. ఇదిలా ఉంటే వేమిరెడ్డి దంపతులుతో రాజకీయంగా సున్నం పెట్టుకోవడం ఎందుకు అనే భావనలో కూడా మంత్రి నారాయణ ఉన్నారు. రాష్ట్ర రాజకీయం, నెల్లూరు సిటీ ది మాత్రమే నాకు చాలు .. ఇది అంతా ఏగడం కష్టం అనేది నారాయణ భావన. ఇదిలా ఉంటే రేసులో ఉన్న మరో వ్యక్తి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూతురు కోటంరెడ్డి సాయి వైష్ణవి. తండ్రికి తగ్గ కూతురు. మాట తీరులో కానీ, మనుషులను ఆకట్టుకోవడంలో కానీ సాయి వైష్ణవిది ప్రత్యేక శైలి. తొలుత వచ్చే ఎన్నికల్లో తన వారసురాలిగా వైష్ణవిని తీసుకుని రావాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భావించారు. ఇందులో భాగంగానే ప్రతీ రాజకీయ వేదికపై కూడా తన కూతురిని తీసుకుని వస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఆమె కూడా క్యాడర్ ను నాడిని పట్టి ముందుకు వెళ్తుంది. నియోజకవర్గంలోని వార్డులు, గ్రామాల నాయకుల పేర్లను కంఠస్థం చేసి... చకచక చెప్పేస్తోంది. అంతే ఆత్మీయంగా నాయకులను స్థాయితో సంబంధం లేకుండా పలకరిస్తుంది. అయితే మేయర్ పదవి కావాల్సి అన్నీ అర్హతలు వైష్ణవి సొంతం. ఇంకా చెప్పాలి అంటే మేయర్ మాత్రమే కాదు భవిష్యత్తులో నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర క్యాబినెట్ లో ఉండబోయే పేరు వైష్ణవిది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మేయర్ కాకపోతే ఎమ్మెల్యే, ఎంపీ ఇలా పదవి అయితే పక్కా. ఇలాంటి బంగారు భవిష్యత్తు తన బిడ్డకు ఉందని నమ్మిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వేమిరెడ్డి దంపతులు రూప్ కుమార్ యాదవ్ కు మద్దతు తెలపడంతో వెనక్కి తగ్గారు. వేమిరెడ్డి దంపతుల మీద ఉన్న గౌరవం గురించి కానీ, పార్టీలో అంతర్ఘత విభేదాలు రాకుండా ఉండాలని ఆలోచించిన ఆయన ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్నారు. ఇలా చూస్తే రూప్ కుమార్ యాదవ్ కు కోటంరెడ్డి ఫ్యామిలీ నుంచి ఎలాంటి ముప్పు లేదు. అయితే కోటంరెడ్డి తాను అడగరు... అధిష్టానం ఆదేశిస్తే తన బిడ్డను నిలబెట్టేందుకు సిద్ధంగానే ఉన్నారు.
రూప్ కుమార్ యాదవ్ కు వచ్చిన ఇబ్బంది ఇదే...
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆశీస్సులు మెండుగా రూప్ కుమార్ యాదవ్ కు ఉండడంతో పోటీకి ముందుకు వచ్చే వారు లేకుండా పోయారు. ఇంకా చెప్పాలి అంటే రూప్ కుమార్ యాదవ్ పోటీ చేస్తే... మేయర్ పదవిని దక్కించుకోవడం నల్లేరు మీద నడకే. అయితే మరి రూప్ కుమార్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి? రూప్ కుమార్ మేయర్ గా పోటీ చేయాలి అంటే కచ్చితంగా తనకు అనుకూలంగా ఉన్న రిజర్వేషన్ రావాలి. అంటే ఓసీ జనరల్, బీసీ జనరల్ ఈ రెండింటిలో ఏదో ఒకటి కన్ఫార్మ్ కావాలి. అలా అయితేనే మేయర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూప్ కుమార్ అర్హులు అవుతారు. అలాంటిది ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరికి సంబంధించి రూప్ కుమార్ కి చిక్కులు ఎదురవుతాయనే భావన వినిపిస్తోంది. నెల్లూరు నగర మేయర్ పదవికి వచ్చే రిజర్వేషన్ ఈసారి రూప్ కుమార్ యాదవ్ కు అనుకూలంగా ఉండదనే వదంతులు నెల్లూరులో విస్త్రృతంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్ ఓసి మహిళగా ఉండబోతుందని ఎక్కడో ఆకాశరామన్నలు కోడై కూస్తున్నారు. మరి కొంతమంది ఈ వాదనను కొట్టి పడేస్తున్నారు. అధికార పార్టీలో ఉండి కూడాను అనుకూలంగా మేయర్ ఎన్నికల్లో రిజర్వేషన్ కావలసిన విధంగా రాకపోవడం ఏంటి అనే సందేహం కూడా చాలా మందికి ఉంది. అయితే ఈ రిజర్వేషన్ మార్పు వదంతుల వెనక జిల్లాకు చెందిన ఓ మంత్రి హస్తం ఉందని కొందరు చెప్తున్నారు. వేమిరెడ్డి దంపతుల నిర్ణయాన్ని ఎదిరించి నిలబడడం జిల్లాలోని ఏ రాజకీయ నాయకుడికి అయినా ప్రస్తుతానికి అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకంటే వేమిరెడ్డి దంపతులు గత ఎన్నికల్లో పార్టీ అస్తిత్వానికి చేసిన కృషి అలాంటిది. దీనితో పాటే రాజకీయంగా నెల్లూరు బలమైన సామాజిక వర్గంలో ఉండడం, ఆర్థికంగా కూడాను బలంగా ఉండడం మరో కారణంగా చెప్పవచ్చు.
రిజర్వేషన్ ఓసీ మహిళ అయితే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..!
రిజర్వేషన్ ఓసీ మహిళ అయితే... మంత్రి నారాయణకు విజయభాస్కర్ రెడ్డి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలానే షరణిని పోటీలో నిలపాలి అనుకుంటే మార్గం సులభం అవుతుంది. మరోవైపు రూప్ కుమార్ ను ప్రొపోజ్ చేసిన వేమిరెడ్డి దంపతులకు తాను వ్యతిరేకం కాదనే అంశం కూడా సుస్పష్టం అవుతుంది. ఇక పూర్తిగా నష్టపోయేది మాత్రం మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న రూప్ కుమార్ యాదవ్. అధికారానికి అడుగు దూరంలో రూప్ ఆగిపోతారేమో అనే భయంతో రూప్ కుమార్, వేమిరెడ్డి అభిమానులు ఉన్నారు.
స్టోరీ ట్యాగ్ లైన్: పిక్చర్ అభీ బాకీ హై..!